Cummins: “ఇది భయానకం” అంటూ రాజస్థాన్‌పై గెలుపు తర్వాత సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ కమ్మిన్స్‌ ఆసక్తికర కామెంట్లు

ఆర్ఆర్ 20 ఓవర్లలో 242/6 పరుగులు మాత్రమే చేయడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ 44 పరుగులతో గెలిచింది.

Pat Cummins Pic: ©ANI

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2025లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ జట్టు బ్యాటర్ల విధ్వంసకర ఆటతీరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌ కమ్మిన్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 286/6 స్కోరు బాదిన విషయం తెలిసిందే. ఇక ఆర్ఆర్ 20 ఓవర్లలో 242/6 పరుగులు మాత్రమే చేయడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ 44 పరుగులతో గెలిచింది.

Also Read: అట్లుంటది మరీ.. రోహిత్ శర్మ మరో మైలురాయి.. హిట్ మ్యాన్ రికార్డు

ఆర్ఆర్‌పై విజయం సాధించిన తర్వాత కమ్మిన్స్‌ మాట్లాడుతూ… తమ బ్యాటర్లు బౌండరీలు బాదిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లకు బౌలింగ్‌ చేసే అవకాశం తనకు లేనందుకు సంతోషపడుతున్నానని చమత్కరించాడు. అంటే, తాను ప్రత్యర్థి జట్టులో ఉండి ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లకు బౌలింగ్‌ చేస్తే తనకు చుక్కలు కనపడేవనే అర్థంలో ఈ వ్యాఖ్య చేశాడు.

“మా ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లకు బౌలింగ్‌ చేయాలని నేనైతే అనుకోను.. ఎందుకంటే వారు అంత ధాటిగా, నమ్మశక్యం కాని రీతిలో ఆడిన తీరు భయానకంగా ఉంది. బౌలర్లకు చాలా కఠిన పరీక్షేనని అందరికీ అర్థమవుతుంది. భారీ స్కోర్ చేస్తున్న గేమ్‌లో కూడా ఒకే ఒక్క ఓవర్‌లో బౌలింగ్‌ బాగా పడితే భారీగా తేడా వస్తుంది.

అది ప్రత్యర్థి జట్టు విజయం సాధించేలా చేస్తుంది. భారీ స్కోర్ చేస్తున్న గేమ్‌లో బౌలర్లు రన్స్‌ ఇవ్వకూడదనే అనుకుంటారు. వారు వేసే తదుపరి ఓవర్‌లో మరింత బాగా బౌలింగ్‌ చేయడానికి మానసికంగా సిద్ధమై వస్తారు. ఇషాన్ కిషన్ ఇవాళ ఆడిన తీరు అసాధారణం. స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నిస్తూనే ఎంజాయ్ చేశాం. మ్యాచ్‌కి ముందు చాలా బాగా సాధన చేశాం. కోచ్‌లు మూడు-నాలుగు వారాలుగా ఇక్కడే ఉండి అద్భుతంగా శిక్షణనిచ్చారు” అని కమ్మిన్స్‌ అన్నాడు.