SRH vs GT : వ‌రుణుడి ఆట‌.. ఒక్క బంతి ప‌డ‌కుండానే మ్యాచ్ ర‌ద్దు.. ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌..

అనుకున్న‌దే జ‌రిగింది. ఉప్ప‌ల్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌, స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ ర‌ద్దైంది.

PIC Credi : IPL

Sunrisers Hyderabad vs Gujarat Titans : అనుకున్న‌దే జ‌రిగింది. ఉప్ప‌ల్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌, స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ ర‌ద్దైంది. వ‌ర్షం కార‌ణంగా ఒక్క బంతి కూడా ప‌డ‌లేదు. మ్యాచ్ ప్రారంభానికి నాలుగు గంట‌ల ముందు భారీ వ‌ర్షం కురిసింది. కాసేప‌టికి తెరిపినిచ్చింది. దీంతో మ్యాచ్ మొద‌ల‌వుతుంద‌ని అంతా భావించారు. అయితే.. టాస్ స‌మ‌యానికి కొద్ది సేప‌టి ముందు మ‌రో సారి వ‌ర్షం మొద‌లైంది. ఇలా మ‌ధ్య‌లో తెరిపినిస్తూ వ‌ర్షం కురుస్తూనే ఉంది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను ర‌ద్దు చేసి ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్‌ను కేటాయించారు.

ఈ క్ర‌మంలో ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న మూడో జ‌ట్టుగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిలిచింది. ఇప్ప‌టికే కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్న సంగ‌తి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్‌లో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ 13 మ్యాచులు ఆడింది.

APL : స‌న్‌రైజ‌ర్స్ ఆల్‌రౌండ‌ర్‌కి ఆంధ్రా ప్రీమియ‌ర్ లీగ్‌లో అత్య‌ధిక ధ‌ర‌

నేటి మ్యాచ్ ర‌ద్దు కాగా.. మ‌రో ఏడు మ్యాచుల్లో విజ‌యం సాధించింది. మొత్తంగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఖాతాలో 15 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానానికి చేరుకుంది. మ‌రో మ్యాచ్‌ను స‌న్‌రైజ‌ర్స్ ఆడాల్సి ఉంది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో లీగ్‌లో చివ‌రి మ్యాచ్‌ను ఎస్ఆర్‌హెచ్ ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధిస్తే టాప్‌-2 స్థానంతో ప్లే ఆఫ్స్‌లోకి వెళ్లొచ్చు. అదే స‌మ‌యంలో రాజ‌స్థాన్ త‌న ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌లో ఓడిపోవాల్సి ఉంటుంది.

కాగా.. గుజ‌రాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఎప్పుడో నిష్క్ర‌మించింది. ఇక ఈ సీజ‌న్‌లో అన్ని మ్యాచులు (14) ఆడిన గుజ‌రాత్ టైటాన్స్ ఖాతాలో 12 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో ఏడో స్థానంలో నిలిచింది.

నాలుగో స్థానం కోసం చెన్నై , ఆర్‌సీబీ పోటీ..

ప్లేఆఫ్స్‌లో మిగిలిన ఒక్క స్థానం కోసం ఆర్‌సీబీ, చెన్నై సూప‌ర్ కింగ్స్ పోటీప‌డుతున్నాయి. శ‌నివారం ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య చిన్న‌స్వామి వేదిక మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే గెలిస్తే ఎలాంటి స‌మీక‌ర‌ణాలు అవ‌స‌రం లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒక‌వేళ బెంగ‌ళూరు ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తే 18 ప‌రుగుల తేడాతో రెండో సారి బ్యాటింగ్ చేస్తే 18.1 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది.

Babar Azam : ఐపీఎల్‌లో కోహ్లి బిజీ.. విరాట్ రికార్డుల ప‌ని ప‌డుతున్న బాబ‌ర్ ఆజాం