Sun stops play in Kent vs Gloucestershire Vitality T20 Blast clash
క్రికెట్ చరిత్రలో ఇలాంటి సంఘటనను దాదాపుగా చూసి ఉంటారు. వర్షం కారణంగానో లేదంటే మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తగా ఉందనో లేదంటే బ్యాడ్ లైట్ కారణంగా క్రికెట్ మ్యాచ్‌లు ఆగిపోయిన సంఘటనలు ఇప్పటి వరకు ఎన్నో చూసి ఉంటాం. గానీ ఎండ కారణంగా మ్యాచ్ ఆగిపోవడాన్ని చూసి ఉండరు. వైటాలిటీ బ్లాస్ట్ టీ20 లీగ్‌లో కెంట్, గ్లౌసెస్టర్‌షైర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది.
ఇంగ్లాండ్‌లోని కాంటర్బరీ మైదానంలో వైటాలిటీ బ్లాస్ట్ టీ20 లీగ్‌లో భాగంగా బుధవారం కెంట్, గ్లౌసెస్టర్‌షైర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కెంట్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. కెంట్ బ్యాటర్లలో హ్యారీ ఫించ్ (42), సామ్ బిల్లింగ్స్ (38) లు రాణించారు. గ్లౌసెస్టర్‌షైర్ బౌలర్లలో అజీత్ డేల్ మూడు వికెట్లు తీశాడు. జోష్ షా, మ్యాట్ టేలర్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. డేవిడ్ పేన్ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం 158 పరుగుల లక్ష్యంతో గ్లౌసెస్టర్‌షైర్ బ్యాటర్లు బరిలోకి దిగారు. ఓపెనర్లు మైల్స్ హమ్మండ్ (25), డి ఆర్సీ షార్ట్ (33) వేగంగా ఆడారు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌ను వెస్ అగర్ వేశాడు. ఈ ఓవర్‌లోని రెండో బంతిని షార్ట్ సిక్స్‌గా మలిచాడు. అయితే.. ఆ తరువాత ఇద్దరు ఓపెనర్లు అంపైర్ల వద్దకు వెళ్లారు. నాకింగ్టన్ రోడ్ ఎండ్ నుండి అస్తమించే సూర్యుని కిరణాలు నేరుగా కళ్లలో పడుతున్నాయని, బంతిని చూడలేకపోతున్నట్లుగా వెళ్లడించారు.
దీంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. దాదాపు 11 నిమిషాల తరువాత మ్యాచ్ మళ్లీ ఫ్రారంభమైంది. కాసేపటికే ఓపెనర్లు ఇద్దరితో పాటు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ (3) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరుకున్నా కూడా కెప్టెన్ జాక్ టేలర్ (54 నాటౌట్), ఆలివర్ ప్రైస్ (41 నాటౌట్) ధాటిగా ఆడడంతో 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి గ్లౌసెస్టర్‌షైర్ విజయాన్ని అందుకుంది.
కాగా.. 2019లో ఇదే మైదానంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లోనూ దాదాపుగా ఇలాంటి ఘటననే జరిగింది. అప్పుడు కూడా సూర్యకిరణాలు నేరుగా బ్యాటర్ల కళ్లల్లో పడడంతో కాసేపు మ్యాచ్‌ను నిలిపివేశారు.