Sunil Gavaskar : ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు పై సునీల్ గ‌వాస్క‌ర్ ఆగ్ర‌హం.. బీసీసీఐ వ‌ద్ద ఉన్న డ‌బ్బు ఉండ‌క‌పోవ‌చ్చు గానీ..

Sunil Gavaskar fires on CSA : ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) పై భార‌త మాజీ దిగ్గ‌జ ఆట‌గాడు సునీల్ గ‌వాస్క‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

Sunil Gavaskar fires on CSA

మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా డ‌ర్బ‌న్ వేదిక‌గా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మొద‌టి టీ20 మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయిన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూశారు. అయితే.. మ్యాచ్ ఆరంభానికి ముందు నుంచే వ‌ర్షం కురిసింది. క‌నీసం ఓవ‌ర్లు కుదించి అయిన మ్యాచ్‌ను నిర్వ‌హిస్తార‌ని ఫ్యాన్స్ భావించారు. అయితే.. గ్రౌండ్ మొత్తం త‌డిగా ఉండ‌డంతో మ్యాచ్ ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు అంపైర్లు ప్ర‌క‌టించారు.

దీంతో క్రికెట‌ర్ల మెరుపులు చూడాల‌ని భావించిన అభిమానులు నిరాశ‌గా మైదానాన్ని వీడారు. ఈ నేప‌థ్యంలో ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ) పై భార‌త మాజీ దిగ్గ‌జ ఆట‌గాడు సునీల్ గ‌వాస్క‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. గ్రౌండ్ మొత్తాన్ని క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంచ‌లేద‌ని మండిప‌డ్డాడు. స్టేడియాల్లో వ‌ర్షం వ‌చ్చిన‌ప్పుడు పిచ్‌తో పాటు గ్రౌండ్ మొత్తాన్ని క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉండ‌చాల‌ని సూచించాడు. డ‌ర్బ‌న్‌లో అయితే.. వ‌ర్షం ఆగిపోయినా స‌రే గంట నుంచి రెండు గంట‌ల వ‌ర‌కు మ్యాచ్ జ‌రిగే ప‌రిస్థితి క‌నిపించ‌లేన్నాడు.

బీసీసీఐ వ‌ద్ద ఉన్న డ‌బ్బు ఉండ‌క‌పోవ‌చ్చు..

పిచ్ ను మాత్ర‌మే క‌వ‌ర్ల‌తో క‌ప్పి ఉంచ‌డంతో మిగ‌తా మైదానం మొత్తం చిత్త‌డిగా మారింద‌న్నారు. ఒక‌వేళ వ‌ర్షం ఆగినా మ్యాచ్ నిర్వ‌హించేందుకు గంట నుంచి రెండు స‌మ‌యం ప‌ట్టేది. మ్యాచ్‌కు స్టేడియాన్ని సిద్ధం చేసిన త‌రువాత మ‌ళ్లీ వ‌ర్షం వ‌స్తే ఇక చేసేది ఏమీ ఉండ‌ద‌న్నారు.

వాస్త‌వానికి అన్ని దేశాల క్రికెట్ బోర్డుల దగ్గ‌ర చాలా న‌గ‌దు ఉంది. డ‌బ్బులు లేవ‌ని బోర్డులు చెబితే మాత్రం అది నిజంగా అబ‌ద్ధం. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ద‌గ్గ‌ర ఉన్నంత డ‌బ్బు మిగ‌తా బోర్డుల ద‌గ్గ‌ర ఉండ‌పోవ‌చ్చు గానీ గ్రౌండ్ మొత్తాన్ని క‌ప్పి ఉంచే క‌వ‌ర్లు కొనుగోలు చేసేంత డ‌బ్బు మాత్రం ఖ‌చ్చితంగా ఉంటుంది గ‌దా అంటూ విమ‌ర్శ‌లు గుప్పించాడు. టీమ్ఇండియా వంటి జ‌ట్లు ఆడేట‌ప్పుడు క‌నీస ఏర్పాట్లు అయినా చేసి ఉండాలంటూ సునీల్ గ‌వాస్క‌ర్ అన్నారు.

ఇదిలా ఉంటే.. భార‌త్, ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల మ‌ధ్య రెండో టీ20 మ్యాచ్ మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు పోర్ట్ ఎలిజ‌బెత్ వేదిక కానుంది.

ట్రెండింగ్ వార్తలు