అదేం విచిత్రమో కానీ.. న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకి సూపర్ ఓవర్(Super Over) ఫోబియా పట్టుకుంది. సూపర్ ఓవర్ శాపంగా మారింది. సూపర్ ఓవర్ ఫోబియా(Super Over Phobia) కివీస్ జట్టుని ఏడిపిస్తోంది. అందులో నుంచి న్యూజిలాండ్(Newzealand) బయటపడలేకపోతుంది. వరుసగా ఓటములే ఎదురవుతున్నాయి. సూపర్ ఓవర్ కివీస్ కు కలిసిరావడం లేదనే విషయం మరోసారి రుజువైంది. హమిల్టన్ వేదికగా గత బుధవారం(జనవరి 29,2020) జరిగిన మూడో టీ20లో భారత్ చేతిలో సూపర్ ఓవర్‌లో ఓడిపోయిన న్యూజిలాండ్.. శుక్రవారం(జనవరి 31,2020) వెల్లింగ్టన్‌లో జరిగిన నాలుగో టీ20లోనూ(T20) మరోసారి టీమిండియా చేతిలో సూపర్ ఓవర్‌లోనే పరాజయం పాలైంది.
న్యూజిలాండ్ కు సూపర్ ఓవర్ శాపంగా మారిందని చెప్పారు. మొత్తంగా.. 2008 నుంచి 8 సార్లు సూపర్ ఓవర్‌లో ఆడిన న్యూజిలాండ్.. ఒక్క మ్యాచ్‌లో మినహా అన్నింటిలోనూ ఓడిపోయింది. 2010లో క్రైస్ట్ చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ ఓవర్‌లో మాత్రమే కివీస్ గెలుపొందింది.
న్యూజిలాండ్ కు సూపర్ ఓవర్ శాపం:
* 2008లో వెస్టిండీస్ చేతిలో ఓటమి
* 2012లో శ్రీలంక, విండీస్ చేతిలో ఓటమి
* 2019లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి
* 2019లో వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి
* 2020లో భారత్ చేతిలో రెండు సార్లు ఓటమి
* 2010లో ఆసీస్ పై గెలుపు
* కివీస్ తరఫున బౌలర్ టిమ్ సౌతీ(Tim Southee) 6 సార్లు సూపర్ ఓవర్ వేశాడు. ఒక్కసారి మాత్రమే ప్రత్యర్థిని అడ్డుకుని గెలిపించాడు.
వెల్లింగ్టన్‌లో ఉత్కంఠభరితంగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ కూడా టై అయ్యింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేయగా.. చేజింగ్ లో సరిగ్గా న్యూజిలాండ్ కూడా 7 వికెట్ల నష్టానికి 165 పరుగులే చేయగలిగింది. చివరి ఓవర్ లో 7 పరుగులు చేయాల్సి ఉండగా.. శార్దుల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 6 పరుగులే ఇచ్చాడు. దీంతో..స్కోర్లు సమం కావడంతో.. సూపర్ ఓవర్ కు దారి తీసింది. ఈ సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. బుమ్రా వేసిన ఈ ఓవర్‌లో సైఫర్ట్, కొలిన్ మున్రో చెరొక ఫోర్ బాదారు.
సూపర్ ఓవర్‌లో 14 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్‌కి ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా 6, 4తో మెరుపు ఆరంభాన్నిచ్చాడు. దీంతో.. సమీకరణం.. 4 బంతుల్లో 4 పరుగులుగా మారిపోయింది. అయితే.. మూడో బంతికి రాహుల్ ఔటవగా.. నాలుగో బంతికి డబుల్ తీసిన కోహ్లీ(Kohli).. ఐదో బంతిని బౌండరీకి తరలించి భారత్‌ని గెలిపించాడు. మూడో టీ20 తరహాలో సూపర్ ఓవర్‌ని ఈ మ్యాచ్‌లోనూ టిమ్ సౌథీనే వేయడం గమనార్హం. వరుసగా రెండు సూపర్ ఓవర్లలో న్యూజిలాండ్ ఓడటంతో సూపర్ ఓవర్ తమకు కలిసిరావడం లేదని కివీస్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఇక ఈ సిరీస్ లో చివరిది, 5వది ఆదివారం జరగనుంది.