Suryakumar Yadav comments after India beat Australia in 4th t20
Suryakumar Yadav : ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకుపోయింది.
భారత జట్టు విజయం పై మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav ) స్పందించాడు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ అద్భుత బ్యాటింగ్‌తో పాటు బౌలర్ల కృషితోనే విజయం సాధించామని చెప్పుకొచ్చాడు. ‘ఈ పిచ్ పై 200 పరుగులు చేయడం కష్టమని ఓపెనర్లు గ్రహించారు. ఈ క్రమంలోనే పరిస్థితులకు తగ్గట్లుగా వారు బ్యాటింగ్ చేశారు. పవర్ ప్లేలో సాధ్యమైనన్ని పరుగులు సాధించారు. ఇక మిగిలిన బ్యాటర్లు కూడా తమ వంతు పాత్రను సమర్థవంతంగా పోషించడంతో పోరాడే స్కోరును సాధించాము.’ అని సూర్య అన్నాడు.
డగౌట్ నుంచి నుంచి కూడా ఎప్పటికప్పుడూ సందేశాలు అందుతూనే ఉన్నాయన్నాడు. ఇక హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, తాను దాదాపుగా ఒకేలా ఆలోచిస్తామని తెలిపాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కాస్త మంచు ప్రభావం ఉన్నప్పటికి కూడా బౌలర్లు పరిస్థితులకు వేగంగా అలవాటు పడ్డారని చెప్పుకొచ్చాడు. ఇక బౌలింగ్‌లో ఎక్కువ అప్షన్లు ఉండడం తమకు కలిసి వచ్చే అంశం అని తెలిపాడు. పిచ్ కండిషన్స్ బట్టి ఏ బౌలర్‌తో ఎన్ని ఓవర్లు వేయించాలనే నిర్ణయాన్ని తీసుకుంటానని తెలిపాడు.
ఈ క్రమంలోనే కొన్ని మ్యాచ్‌ల్లో వాషింగ్టన్ సుందర్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేస్తాడని, మరికొన్ని మ్యాచ్‌ల్లో రెండు, మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయవచ్చునన్నాడు. ఇక అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబెలతో పాటు మిగిలిన బౌలర్లకు ఇదే జరగొచ్చునన్నాడు. జట్టు కోసం రాణించేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారన్నాడు.
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..! తెలుగు రాష్ట్రాలకు అన్యాయం..?
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (46; 39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ శర్మ (28), శివమ్ దూబె (22), సూర్యకుమార్ యాదవ్ (20) లు రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. జేవియర్ బార్ట్‌లెట్, మార్కస్ స్టోయినిస్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఆ తరువాత 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 48 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (30), మాథ్యూ షార్ట్ (25) లు రాణించారు. టీమ్ఇండియా వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, శివమ్ దూబెలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా లు తలా ఓ వికెట్ సాధించారు.