T20 World Cup 2026 : నమీబియా బౌలర్లు అద్భుతంగా బంతులు వేశారు.. మా బౌలర్లు ఉన్నారు చూడండి.. టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కామెంట్స్..
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) భాగంగా గురువారం ఢిల్లీ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 93 పరుగుల తేడాతో గెలుపొందింది.
- Thota Vamshi Kumar
- Published On : February 13, 2026 / 10:41 AM IST
Suryakumar Yadav comments after India beat Namibia in T20 World Cup 2026
- టీ20 ప్రపంచకప్2026లో వరుసగా రెండో విజయం
- భారత కెప్టెన్ సూర్య కామెంట్స్
- నమీబియా బౌలర్లపై ప్రశంసల జల్లు
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో భారత జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. గురువారం ఢిల్లీ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 93 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (61; 24 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (52; 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీలు బాదారు. సంజూ శాంసన్ (22), తిలక్ వర్మ (25), శివమ్ దూబె (23) లు రాణించారు. నమీబియా బౌలర్లలో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ నాలుగు వికెట్లు సాధించాడు.
అనంతరం 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకు కుప్పకూలింది. నమీబియా బ్యాటర్లలో ఓపెనర్ లౌరెన్ స్టీన్‌క్యాంప్ (29), జాన్ ఫ్రైలింక్ (22) రాణించారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అర్ష్‌దీప్ సింగ్, శివమ్‌దూబె, బుమ్రాలు తలా ఓ వికెట్ సాధించారు.
ఈ పిచ్ పై అంత తేలిక కాదు..
మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇది అంత తేలికైన పిచ్ కాదన్నాడు. నమీబియా బౌలర్లను మెచ్చుకున్నాడు. ‘ఇది చాలా మంచి గేమ్. వాస్తవానికి ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. అయితే.. ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించిన విధానం చూసి అంతా బ్యాటింగ్ పిచ్ అని అనుకుంటారు. వెంటవెంటనే రెండు మూడు వికెట్లు కోల్పోయిన తరువాత శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా ల భాగస్వామ్యంతో జట్టు పటిష్ట స్థితికి చేరింది. వారిద్దరూ చాలా చక్కగా ఆడారు.’ అని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు.
ఇక పిచ్ పై బంతి కాస్త ఆగి వస్తుందన్నాడు. అయినప్పటికి కూడా నమీబియా బౌలర్లందరికి క్రెడిట్ ఇవ్వాల్సిందేనని చెప్పుకొచ్చాడు. వారు తమ ప్రణాళికలకు మైదానంలో చక్కగా అమలు చేశారన్నాడు. ఓ దశలో 250 పరుగులు కూడా మేము చేస్తామని అనుకున్నాము. అయితే.. నమీబియా బౌలర్లలో ఆఖరిలో అద్భుతంగా మమ్మల్ని కట్టడి చేశారన్నాడు. ఇది క్రికెట్ ఎప్పుడు ఏం జరుగుందో ఎవరికి తెలియదన్నాడు.
ఇక జస్‌ప్రీత్ బుమ్రా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయడం చాలా బాగుందన్నాడు. అతడు పాక్‌తో మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ఇక భారత బౌలర్లు వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ స్పిన్ ద్వయాన్ని ఎదుర్కొనడం ఎలాంటి జట్టుకైనా చాలా కష్టమన్నాడు. వారిద్దరూ చాలా చక్కగా బౌలింగ్ చేశారన్నాడు. హార్దిక్ పాండ్యా జట్టుకు ఆస్తి అని తెలిపాడు. అతడు బ్యాటింగ్‌తో పాటు కొత్త బంతితో లేదంటే మిడిల్ ఓవర్లలో లేదంటే డెత్ ఓవర్లలో ఎక్కడైనా అతడు బౌలింగ్ చేస్తాడని తెలిపాడు. ఇక జట్టు ఆటతీరుపై మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఆడిన విధానంతో తాను సంతోషంగానే ఉన్నట్లు సూర్య చెప్పాడు.
