Suryakumar Yadav turns 33 : టీ20ల్లో నంబ‌ర్ వ‌న్‌గా ఉన్న సూర్య‌కుమార్ యాద‌వ్ గ‌ణాంకాలు ఇవే..

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆల‌స్యంగా ఎంట్రీ ఇచ్చాడు సూర్య‌కుమార్‌. 2021 మార్చిలో ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అంత‌ర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు.

Suryakumar Yadav

Suryakumar Yadav : సూర్య‌కుమార్ యాద‌వ్ గురువారం (సెప్టెంబర్ 14) 33 ప‌డిలో అడుగుపెట్టాడు. ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో అత‌డికి ఫ్యాన్స్‌, క్రికెట‌ర్లు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆల‌స్యంగా ఎంట్రీ ఇచ్చాడు సూర్య‌కుమార్‌. 2021 మార్చిలో ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అంత‌ర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్ పేస‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ బౌలింగ్‌లో సిక్స్ తో త‌న ప‌రుగుల వేట‌ను ప్రారంభించాడు. అక్క‌డి నుంచి టీ20ల్లో త‌న ప‌రుగుల ప్ర‌వాహం మొద‌లైంది. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే పొట్టి ఫార్మాట్‌లో త‌న‌దైన ముద్ర వేస్తూ నంబ‌ర్ వ‌న్ ఆట‌గాడిగా నిలిచాడు.

త‌న విధ్వంస‌క‌ర ఆట‌తీరుతో ఎంతో మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు. మైదానం న‌లువైపులా షాట్లు కొడుతూ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ గా పేరుగాంచాడు. ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్ఇండియా త‌రుపున‌ సూర్య‌కుమార్ 53 టీ20 మ్యాచులు ఆడాడు 50 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కు దిగిన అత‌డు 46.02 స‌గ‌టుతో 172.70 స్ట్రైక్‌రేటుతో 1,841 ప‌రుగులు చేశాడు. ఇందులో మూడు శ‌త‌కాలు, 15 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. అత‌డి అత్య‌ధిక స్కోరు 117. ఇంగ్లాండ్ పై ఇంగ్లాండ్‌లోనే అత‌డు త‌న అత్యుత్త‌మ స్కోరును అందుకున్నాడు.

Asia Cup 2023: రెండు జట్ల స్కోర్ సమం.. శ్రీలంక విజేతగా ఎలా అయింది? అసలు ఈ లెక్కేంటి!

ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2022లో భార‌త జ‌ట్టు సెమీఫైన‌ల్ చేర‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో 6 మ్యాచుల్లో 59.75 స‌గ‌టుతో 190 స్ట్రైక్ రేటుతో 239 ప‌రుగులు చేశాడు. ఇందులో మూడు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 68. ద‌క్షిణాఫ్రికాపై సాధించాడు. టోర్న‌మెంట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన మూడో ఆట‌గాడిగా నిలిచాడు.

2022 ఐసీసీ టీ20 ప్లేయ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్..

2022లో సూర్య‌కుమార్ త‌న విశ్వ‌రూపాన్ని చూపించాడు. మొత్తం 31 టీ20 మ్యాచులు ఆడిన సూర్య‌.. 46.56 స‌గ‌టుతో 187 స్ట్రైక్ రేటుతో 1,164 ప‌రుగులు చేశాడు. ఇందులో రెండు శ‌త‌కాలు, తొమ్మిది అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. దీంతో 2022 ఐసీసీ టీ20 ప్లేయ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు అత‌డిని వ‌రించింది.

టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక స్ట్రైక్ రేటు క‌లిగిన రికార్డు సూర్య‌కుమార్ దే. 53 మ్యాచుల్లో 12 సార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల‌ను గెలుచుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో మ‌హ్మ‌ద్ న‌బీ(109 మ్యాచుల్లో 14), విరాట్ కోహ్లీ (115 మ్యాచుల్లో 15) త‌రువాత అత్య‌ధిక ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల‌ను గెలుచుకున్న మూడ‌వ ఆట‌గాడిగా నిలిచాడు.

టీ20 స్పెష‌లిస్ట్‌..

త‌న కెరీర్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ మొత్తంగా(అంత‌ర్జాతీయ‌, ఐపీఎల్‌, లిస్ట్ ఏ) 263 టీ20 మ్యాచులు ఆడాడు. 240 ఇన్నింగ్స్‌ల్లో బ‌రిలోకి దిగిన సూర్య 35.28 స‌గ‌టుతో 151 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో 6,698 ప‌రుగులు చేశాడు. ఇందులో నాలుగు శ‌త‌కాలు, 44 అర్థ‌శత‌కాలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 117.

Asia Cup 2023: ఆసియాకప్ ఫైనల్‌లో భారత్‌, శ్రీలంక జట్లు ఎన్నిసార్లు తలపడ్డాయో తెలుసా? ఎవరిది పైచేయి అంటే..

ఐపీఎల్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ ముంబై ఇండియ‌న్స్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. 139 మ్యాచుల్లో 32.17 స‌గ‌టుతో 143 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో 3,249 ప‌రుగులు చేశాడు. ఇందులో ఒక సెంచ‌రీ, 21 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 103. 2014లో కోల్‌క‌తా ఐపీఎల్ టైటిల్ గెలిచిన టీమ్‌లో స‌భ్యుడిగా ఉన్నాడు. అంతేకాకుండా ముంబై ఇండియ‌న్స్ త‌రుపున 2013, 2019, 2020 ఐపీఎల్ క‌ప్‌ల‌ను ముద్దాడాడు. ఐపీఎల్‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన ఆట‌గాళ్ల‌లో సూర్య‌కుమార్ ఒక‌డు.

అయితే.. టీ20 ఫార్మాట్‌లో చెల‌రేగే సూర్య‌కుమార్ యాద‌వ్ వ‌న్డేల్లో మాత్రం త‌న‌దైన ముద్ర వేయ‌లేక‌పోయాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 26 వ‌న్లేలు ఆడి 24.3 స‌గ‌టుతో 511 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇందులో రెండు అర్థ‌శ‌త‌కాలు మాత్ర‌మే ఉన్నాయి. వన్డేల్లో ప్రభావం చూపకపోయినా ఆసియా కప్, వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ జట్లకు ఎంపికయ్యాడు.

ట్రెండింగ్ వార్తలు