T20 World Cup 2026 ICC Set To Suggest These 2 Venues for Bangladesh
T20 World Cup 2026 : భద్రతా కారణాల దృష్ట్యా తాము భారతదేశంలో టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్‌లను ఆడలేమని, తమ జట్టు ఆడే మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పలు మార్లు లేఖలు రాసింది.
దీనిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్పందించింది. బంగ్లాదేశ్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించినట్లు సమాచారం. శ్రీలంకకు మ్యాచ్‌లను తరలించేది లేదని స్పష్టం చేసింది.
ఇప్పటికే టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. ఈ మెగాటోర్నీ ప్రారంభానికి నెలరోజుల కంటే చాలా తక్కువ సమయం ఉంది. ఈ షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ టీ20 ప్రపంచకప్‌లోని తన గ్రూప్ మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై వేదికగా ఆడాల్సి ఉంది. అయితే.. ఈ వేదికల స్థానాల్లో చెన్నై, తిరువనంతపురంలో ఆడాలని బీసీబీకి ఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ప్రతిపాదనను బంగ్లాదేశ్ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. తమ చేతుల్లో ఏమీ లేదని, తమ ప్రభుత్వం చేతిలోనే నిర్ణయం ఆధారపడి ఉందని చెప్పింది.
బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రపంచ కప్ విషయంలో మేము ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం లేదని మీకు తెలుసు. మేము ప్రభుత్వంతో చర్చిస్తాం. ఆ తరువాతనే నిర్ణయం తీసుకుంటాం. అని చెప్పాడు.
భారత్‌లో బంగ్లాదేశ్ అంపైర్ సర్ఫుద్దౌలా సైకత్..
వడోదర వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అంపైర్ సర్ఫుద్దౌలా సైకత్ విధులు నిర్వహించాడు. ఈ క్రమంలో భద్రత ఆందోళనను లేవనెత్తున్న బంగ్లాకు అంపైర్ సైకత్ ఎలాంటి ఆటంకం లేకుండా విధులు నిర్వర్తించిన విషయాన్ని ఐసీసీ ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక టీ20 ప్రపంచకప్ 2026లోనూ సైకత్ తో పాటు మరో బంగ్లా అంపైర్ గాజీ సోహెల్ విధులు నిర్వర్తించనున్నారు.