IND vs ZIM : ఓటమికి సాకులు చెప్పడం లేదు.. ఆ ఒక్క పని చేసి ఉంటే గెలిచేవాళ్లం.. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా కామెంట్స్..
టీమ్ఇండియాను తక్కువ స్కోరుకు కట్టడి చేసి ఉంటే ఫలితం మరో రకంగా ఉండేదని (IND vs ZIM) జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా అన్నాడు.
- Thota Vamshi Kumar
- Published On : February 27, 2026 / 07:36 AM IST
T20 World Cup 2026 Sikandar Raza comments after Zimbabwe lost match to Team India
- భారత్ చేతిలో ఓడిన జింబాబ్వే
- టీ20 ప్రపంచకప్ సెమీస్ రేసు నుంచి ఔట్
- కెప్టెన్ సికిందర్ రజా కామెంట్స్
IND vs ZIM : టీమ్ఇండియాను తక్కువ స్కోరుకు కట్టడి చేసి ఉంటే ఫలితం మరో రకంగా ఉండేదని జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా అన్నాడు. గురువారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 72 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో జింబాబ్వే ప్రపంచకప్ సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో అభిషేక్ శర్మ (55; 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (50నాటౌట్; 23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్థశతకాలు బాదారు. తిలక్ వర్మ (44 నాటౌట్; 16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (33; 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (38; 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), సంజూ శాంసన్ (24; 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) వేగంగా ఆడారు.
Shreyanka Patil : ఆస్ట్రేలియాలో భారత మహిళా క్రికెటర్ శ్రేయాంక పాటిల్ షికార్లు
అనంతరం బ్రియాన్ బెన్నెట్ (97 నాటౌట్; 59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికి కూడా 257 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులకే పరిమితమైంది. సికిందర్ రజా (31 ;21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివమ్ దూబె లు తలా ఓ వికెట్ సాధించారు.
220 పరుగుల లోపు కట్టడి చేసి ఉంటే..
మ్యాచ్ అనంతరం ఓటమిపై జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా స్పందించాడు. మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి కూడా తమ జట్టు బ్యాటింగ్ ప్రదర్శన సంతృప్తి ఇచ్చిందని అన్నాడు. గత మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో ఆడినప్పుడు 250 పరుగుల లక్ష్య ఛేదనలో జట్టు బ్యాటింగ్ లో కాస్త తొందరపాటు కనిపించిందని అన్నాడు. అయితే.. భారత్‌తో మ్యాచ్‌లో తొలి ఆరు ఓవర్లలో ఎంతో సంయమనంతో ఆడామని తెలిపాడు. మాకు మేము ఓ అవకాశాన్ని కల్పించుకున్నామని చెప్పాడు. మొత్తంగా గత మ్యాచ్‌తో పోల్చి చూస్తే భారత్‌తో బ్యాటర్లు ఆడిన తీరు పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
బౌలింగ్‌లో ప్రణాళికలను పక్కగా అమలు చేసి ఉంటే బాగుండేదన్నాడు. అయితే.. ఒక్కొసారి ఇలా జరుగుతుందని చెప్పుకొచ్చాడు. భారత్‌ను 210 నుంచి 220 పరుగుల లోపు కట్టడి చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో ఇంకాస్త మెరుగుపడాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. ఇక తమ జట్టులో చాలా మంది యువకులు ఉన్నారని, భారతదేశంలో ఆడడం వారందరికి ఇదే తొలిసారన్నాడు. అయితే.. దీనిని ఓటమికి సాకుగా మాత్రం చెప్పడం లేదన్నాడు. మూడు విభాగాల్లోనూ రాణించాలన్నాడు. ఒక్క చిన్న పొరపాటు చేసిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నాడు.
