T20 World Cup : ఓడినా.. లాస్ట్‌లో రచ్చరచ్చ చేసిన జింబాబ్వే బ్యాటర్లు.. పదో వికెట్‌కు రికార్డ్ బ్రేక్ భాగస్వామ్యం..
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా సూపర్-8లో సోమవారం రాత్రి వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు భారీ పరుగుల తేడాతో పసికూన జట్టుపై విజయం సాధించింది.
- Harishth Thanniru
- Published On : February 24, 2026 / 08:31 AM IST
T20 World Cup
- సూపర్ -8లో జింబాబ్వేపై వెస్టిండీస్ విజయం
- ఓడిపోయినా చివరిలో చెలరేగిన ఎవాన్స్
- 19బంతుల్లోనే 44 పరుగులు.. ఐదు సిక్సర్లు..
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా సూపర్-8లో సోమవారం రాత్రి వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చింది. మ్యాచ్ ముగిసే వరకూ ఇరు జట్లు సిక్సర్ల మోతతో స్టేడియాన్ని దద్దరిల్లించారు.
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్-8 మ్యాచ్ లో వెస్టిండీస్ విధ్వంసం సృష్టించింది. పసికూన జింబాబ్వే జట్టుపై విండీస్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. వెస్టిండీస్ బ్యాటర్ హెట్‌మైర్ రెచ్చిపోయాడు. బ్యాటుతో స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించారు. కేవలం 34బంతులు ఆడిన హెట్‌మైర్ స్టేడియంలో చిన్నపాటి విధ్వంసమే సృష్టించాడు. ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్ల సహాయంతో 85 పరుగులు చేశాడు. అతడితోపాటు రావ్‌మన్ పావెల్ (59) రాణించడంతో వెస్టిండీస్ భారీ స్కోర్ చేసింది. కాగా.. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ ఇది కావడం విశేషం.
భారీ పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు మొదటి నుంచి వరుసగా వికెట్లు చేజార్చుకుంది. 52 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడిన జట్టును.. మున్యోంగా (14) తో కలిసి రజా(27) ఇన్నింగ్స్ నడిపించడంతో ఆ జట్టు 10 ఓవర్లలో 87 పరుగులు చేసింది. అయితే, ఓటమి ఖాయమైనప్పటికీ.. భారీ ఓటమి నుంచి తప్పించుకునేందుకు జింబాబ్వే బ్యాటర్లు చివరి వరకు పోరాటం సాగించారు.
ఈ క్రమంలో చివరిలో బ్రాండ్ ఎవాన్స్ అద్భుత బ్యాటింగ్ విన్యాసాలతో జట్టు అభిమానులను అలరించాడు. అతడు నగారవా (7 నాటౌట్)తో కలిసి చివరి వికెట్‌కు 44 పరుగులు చేశాడు. కేవలం 19 బంతుల్లోనే 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో పదో వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం.
బ్రాండ్ ఎవాన్స్ 21 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 43 పరుగులు బాదాడు. నగారవా ప్రారంభంలోనే సిక్సర్ బాదడంతో.. ఆ తరువాత ఎవాన్స్ ఐదు సిక్సర్లు నమోదు చేశాడు. దీంతో ఈ ఇద్దరూ ఆరు సిక్సర్లు.. ఒక ఫోర్‌తో వాంఖడే స్టేడియంలో ప్రేక్షకులను అలరించారు. అయితే, జింబాబ్వే జట్టు 17.4 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో వెస్టిండీస్ జట్టు 107 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొత్తం 31 సిక్సర్లు నమోదు కావడం విశేషం.
GROUP 1 POINTS TABLE.
– NRR of West Indies and South Africa could trouble India. pic.twitter.com/eSEmXmrq7n
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2026
