T20 worldCup 2026
T20 worldCup 2026 : టీ20 ప్రపంచకప్-2026లో సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునేందుకు సూపర్-8 జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్ -బి నుంచి ఇంగ్లాండ్ జట్టు సెమీస్‌కు చేరుకోగా.. గ్రూప్ -ఏలో జట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య పోటీ నెలకొంది. అయితే, ఇప్పటికే తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టుపై ఓటమి పాలైన టీమిండియా.. ఈనెల 26న (గురువారం) జింబాబ్వే జట్టుపై జరిగే మ్యాచ్‌లో భారీ రన్‌రేట్ తేడాతో విజయం సాధించాల్సి ఉంది. ఇలాంటి కీలక మ్యాచ్ సమయంలో భారత జట్టుకు బిగ్‌షాక్ తగిలింది.
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ వ్యక్తిగత కారణాలతో జట్టును వీడాడు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో రింకూ హుటాహుటీన ఇంటికి బయలుదేరి వెళ్లాడు. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ కు కూడా రింకూ సింగ్ దూరమయ్యాడు. అయితే, అతను ఎప్పుడు తిరిగి వస్తాడనే విషయంపై స్పష్టత లేదు.
టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో రింకూ సింగ్‌కు ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, రింకూ సింగ్ చివరి ఓవర్లలో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే సత్తాకలిగిన బ్యాటర్. చివరి ఓవర్లలో క్రీజులోకి వచ్చి అనేకసార్లు భారత జట్టును విజయతీరాలకు చేర్చిన చరిత్ర రింకూకు ఉంది. ముఖ్యంగా టీ20 మ్యాచ్ లలో రింకూ సింగ్ భారత జట్టుకు కీలక ప్లేయర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
సూపర్-8లో భాగంగా ఇటీవల సౌతాఫ్రికాతో మ్యాచ్ లో ముందుగానే బ్యాటింగ్ కు వచ్చినప్పటికీ రింకూ సింగ్ పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. డకౌట్ తో పెవిలియన్ కు చేరాడు. కానీ, రాబోయే రెండు మ్యాచ్ లలో రింకూ సింగ్ జట్టులో ఉండటం ముఖ్యమని జట్టు మేనేజ్మెంట్ భావించగా.. ఊహించని విధంగా తన తండ్రి అనారోగ్యం కారణంగా రింకూ సింగ్ జట్టును వీడటం టీమిండియాకు బిగ్ షాక్ అని చెప్పొచ్చు.
సౌతాఫ్రికా జట్టుపై ఓటమితో భారత జట్టు సెమీస్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది. భారత జట్టు గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో భారీ రన్ రేట్ తో విజయం సాధించాల్సి ఉంటుంది. మార్చి 1న వెస్టిండీస్ జట్టుపైనా విజయాన్ని నమోదు చేయాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ లు టీమిండియాకు చాలా కీలకం. ఇలాంటి సమయంలో రింకూ జట్టును వీడడం భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బగానే చెప్పుకోవాలి.