Asian Games 2023: ఆసియా క్రీడలు క్వార్టర్ ఫైనల్లో భారత్ జట్టు ఘన విజయం.. సెమీస్ లోకి ఎంట్రీ

క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో నేపాల్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించి సెమీస్ కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 202/4 పరుగులు చేసింది.

Asian Games 2023

IND vs NEP T20 Match: ఆసియా క్రీడల్లో భారత్ క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. భారత్ పలు విభాగాల్లో ఇప్పటికే 13 గోల్డ్ మెడల్స్ సాధించగా.. 24 సిల్వర్ పతకాలు సాధించింది. మొత్తం 61 పతకాలతో దూసుకెళ్తుంది. ఈ క్రమంలో పురుషుల క్రికెట్ విభాగంలోనూ భారత్ జట్టు సత్తాచాటుతోంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో నేపాల్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించి సెమీస్ కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 202/4 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ సెంచరీ చేశాడు. 203 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నెదర్లాండ్ జట్టు భారత్ బౌలర్ల దాటికి లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది. 20 ఓవర్లలో 179/9 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్ లోకి అడుగు పెట్టింది.

Read Also : Asian Games 2023 : టీ20 క్రికెట్ చరిత్రలో యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు

టీమిండియా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగారు. జైస్వాల్ మొదటి నుంచి దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 103 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 9.5 వ ఓవర్ వద్ద రుతురాజ్ గైక్వాడ్ (25) దీపేంద్ర సింగ్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించిన రోహిత్ పౌడెల్ చేతికి చిక్కాడు. ఆ తరువాత తిలక్ వర్మ (2) క్రీజులోకి వచ్చినా వెంటనే పెవిలియన్ బాటపట్టాడు. సోంపాల్ బౌలింగ్ లో తిలక్ వర్మ బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత జితేశ్ శర్మ (5) కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. ఈ క్రమంలో 16వ ఓవర్లో యశస్వీ జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 48 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఆ వెంటనే దీపేంద్ర సింగ్ బౌలింగ్ లో అభినాష్ చేతికి చిక్కి జైస్వాల్ ఔట్ అయ్యాడు. ఆ తరువాత శివం దూబే (25నాటౌట్), రింకు సింగ్ (37 నాటౌట్)లు బ్యాట్ ఝుళిపించడంతో భారత్ 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది.

Read Also : ODI World Cup 2023: వరల్డ్ కప్ చరిత్రలో భారత్ ఏ జట్టుపై ఎక్కువసార్లు గెలిచిందో తెలుసా? జట్ల వారిగా పూర్తి వివరాలు ఇలా ..

203 పరుగుల లక్ష్యంతో నేపాల్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. కుశాల్, ఆసిఫ్ ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. ఆ జట్టుకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆసిఫ్ (10), కుశాల్ భుర్టెల్ (28) తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. 10 ఓవర్లు పూర్తయ్యే సరికి నేపాల్ 73 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తరువాత 11 ఓవర్లో రోహిత్ (3), కుశాల్ మల్లా (29) ఇద్దరు ఔట్ అయ్యారు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన డేంజరస్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ దూకుడుగా ఆడాడు. 14.2 ఓవర్లో రవి బిష్ణోయ్ వేసిన బౌలింగ్ లో సాయి కిశోర్ చేతికి చిక్కి దీపేంద్ర సింగ్ పెవిలియన్ బాట పట్టాడు. సిక్సర్లతో భయపెట్టిన సందీప్ (29) కూడా ఔట్ కావడంతో భారత్ విజయం ఖాయమైంది. ఆ తరువాత బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో 20 ఓవర్లు పూర్తయ్యే సరికి నేపాల్ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. దీంతో టీమిండియా సెమీస్ లోకి అడుగు పెట్టింది.

 

ట్రెండింగ్ వార్తలు