Temba Bavuma comments after South Africa win the match against india in 2nd ODI
Temba Bavuma : రాంచి వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి కూడా రాయ్‌పూర్ వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్ ను ప్రస్తుతానికి 1-1తో సమం చేసింది. ఇక కీలకమైన మూడో వన్డే మ్యాచ్ శనివారం (డిసెంబర్ 6న)న జరగనుంది.
రెండో వన్డే మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించడం పై దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (Temba Bavuma) ఆనందాన్ని వ్యక్తం చేశాడు. బ్యాటర్లు అసాధారణంగా ఆడారని, జట్టులో ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకున్నారన్నారు. ఆఖరి మ్యాచ్‌లోనూ ఇదే ఆటతీరును కొనసాగించి సిరీస్‌ను సొంతం చేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశాడు.
మ్యాచ్ అనంతరం బవుమా మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో గెలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. తొలుత బంతితో మెరుగైన ప్రదర్శనే చేశాము. ఇక లక్ష్య ఛేదనలో భాగస్వామ్యాలు ఎంతో కీలకం. కాబట్టి నేను.. మార్‌క్రమ్‌తో కలిసి ఆ పనిని చేశాను. మార్‌క్రమ్ దూకుడుగా ఆడుతుంటే.. నేను అతడికి స్ట్రైకింగ్ ఇవ్వడంపైనే దృష్టి సారించాను. ఏది ఏమైనప్పటికి చివరి వరకు ఆడాలని అనుకున్నాను. అయితే.. నేను ఆ పని చేయలేకపోయాను. అయినప్పటికి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాను అని అన్నాడు.
బ్రీట్జ్కే ఫామ్‌ను కొనసాగించాడని, ఆఖరిలో కార్బిన్ బోష్ ఎంతో మెరుగ్గా బ్యాటింగ్ చేసి విజయాన్ని అందించాడని చెప్పుకొచ్చాడు. మొత్తంగా ఈ మ్యాచ్ నమ్మశక్యంగా లేదన్నాడు. ఇది ఓ రికార్డు ఛేదన అని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు. ఈ విజయం తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందన్నాడు. ఇది అత్యుత్తమ టీమా అని అడిగితే తాను అవుననే సమాధానం చెబుతానని తెలిపాడు.
జట్టులో స్థానం కోసం ఆటగాళ్ల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఉందన్నాడు. అటు బ్యాటర్ల మధ్య గానీ, ఇటు బౌలర్ల మధ్య గానీ అదే స్థాయిలో పోటీ ఉందన్నాడు. ఈ పర్యటన కుర్రాళ్లకు చక్కని అవకాశం. తమను తాము నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక బర్గర్, డి జోర్జీలు గాయాలతో బాధపడుతున్నారు. వారు ఆఖరి వన్డే వరకు కోలుకోకుంటే వారి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లు కూడా తమ జట్టులో ఉన్నారని బవుమా అన్నాడు.