Ravindra Jadeja: ఇది నా తొలి విజయం.. నా భార్యకే అంకితం – జడేజా

చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా తొలి విజయాన్ని నమోదు చేశాడు రవీంద్ర జడేజా. డీవై పాటిల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 23పరుగుల తేడాతో బెంగళూరు జట్టుపై చెన్నై..

Ravindra Jadeja (1)

Ravindra Jadeja: చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా తొలి విజయాన్ని నమోదు చేశాడు రవీంద్ర జడేజా. డీవై పాటిల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 23పరుగుల తేడాతో బెంగళూరు జట్టుపై చెన్నై గెలుపొందింది. ధోనీ చేతుల మీదుగా కెప్టెన్ క్యాప్ అందుకున్న జడేజా.. తొలి నాలుగు గేమ్ లలో పరాజయాన్ని చవిచూశాడు.

ఎట్టకేలకు మంగళవారం.. రాబిన్ ఊతప్ప, శివమ్ దూబెల మధ్య చక్కటి భాగస్వామ్యం నెలకొనడంతో స్కోరు 215పరుగులకు చేరింది. లక్ష్య చేధనలో భాగంగా పోరాడిన బెంగళూరు.. 193పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ జడేజా ఇలా మాట్లాడాడు.

“ముందుగా కెప్టెన్ గా ఇది నా తొలి విజయం. ఇది నా భార్యకు అంకితం ఇస్తున్నా. చివరిగా ఆడిన నాలుగు గేమ్ లలో విజయాన్ని చేరుకోలేకపోయాం. రాబిన్, శివమ్ చేసిన బ్యాటింగ్ తీరు ఇవాళ మమ్మల్ని అక్కడకు చేర్చింది. మా మేనేజ్మెంట్ నాపై ఒత్తిడి తీసుకురాలేదు. నన్ను ప్రోత్సహించారు. సీనియర్ల నుంచి సలహాలు తీసుకున్నా. మహీ భాయ్ ఉన్నాడు. ఎప్పుడూ అతనితోనే చర్చిస్తుంటా” అని అన్నాడు జడేజా.

Read Also: ఎట్టకేలకు చెన్నై బోణీ.. బెంగళూరుపై ఘన విజయం

“ఒక బాధ్యత తీసుకున్నప్పుడు అందులోకి వెళ్లడానికి కాస్త సమయం పడుతుంది. ప్రతి రోజూ నేర్చుకుంటూనే ఉన్నా. డ్రెస్సింగ్ రూంలో మాకు చాలా అనుభవం ఉంది. అదే పనికొచ్చింది. కంగారుపడకుండా.. పాజిటివ్ క్రికెట్ ఆడాలి. సరైన సమయం వచ్చినప్పుడు ప్రదర్శించాలి” అని జడేజా వివరించాడు.