Tilak Varma breaks Kohli T20I record after stunning performance against England in 2nd T20
ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై భారత్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమ్ఇండియా యువ ఆటగాడు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.
చెన్నైతో మ్యాచ్‌తో కలిసి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో (19*, 120*, 107*, 72* ) ఔట్ కాకుండా నిలిచి తిలక్ వర్మ 318 పరుగులు సాధించాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. కోహ్లీ టీ20ల్లో ఔట్ కాకుండా 258 పరుగులు చేశాడు. వీరిద్దరి తరువాత సంజూ శాంసన్ (257), రోహిత్ శర్మ (253), శిఖర్ ధావన్ (252) లు ఉన్నారు.
టీ20ల్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు..
తిలక్ వర్మ – 318* పరుగులు
విరాట్ కోహ్లీ – 258 పరుగులు
సంజూ శాంసన్ – 257 పరుగులు
రోహిత్ శర్మ – 253 పరుగులు
శిఖర్ ధావన్ – 252 పరుగులు
ఇక ఓవరాల్‌గా తీసుకున్నా కూడా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా తిలక్ వర్మ నే నిలిచాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్‌మన్ పేరిట ఉండేది. చాప్‌మన్ 271 పరుగులు చేశాడు. ఈ జాబితాలో శ్రేయస్ అయ్యర్ (240), ఆరోన్ ఫించ్ (240), డేవిడ్ వార్నర్ (239) లు సైతం ఉన్నారు.
ఒంటరి పోరాటం..
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత ఆటగాళ్లు తడబడ్డారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ (12), సంజూ శాంసన్ (5)లతో పాటు కెప్టెన్ సూర్యకుమార్ (12) లు తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆదుకుంటారు అనుకున్న ధ్రువ్ జురెల్ (4), హార్దిక్ (7) లు సైతం విఫలం అయ్యారు. అయితే.. తిలక్ వర్మ ఒంటరిపోరాటం చేశాడు. ఓ ఎండ్‌లో క్రీజులో పట్టుదలతో నిలిచాడు.
తనదైన శైలిలో షాట్లతో మైదానం నలువైపులా పరుగులు సాధించాడు. ఓ వైపు వికెట్లు పడతున్నా దూకుడు కొనసాగించాడు. అతడికి సుందర్ (19 బంతుల్లో 26 పరుగులు) చక్కని సహకారం అందించాడు. అయితే.. సుందర్ తో పాటు అక్షర్ పటేల్ (2)లు స్వల్ప వ్యవధిలో ఔట్ అయ్యారు. అర్షదీప్ సింగ్ (6) సైతం పేలవషాట్‌తో పెవిలియన్‌కు చేరుకున్నా కూడా బిష్ణోయ్ (9) సహకారంతో తిలక్ వర్మ జట్టును గెలిపించాడు. 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. తిలక్ విజృంభణతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకుపోయింది.