CPL 2025 Trinbago Knight Riders lift the Caribbean Premier League title 5th time
CPL 2025 : కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2025 విజేతగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ నిలిచింది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అమెజాన్ వారియర్స్‌ను చిత్తు చేసి ఐదోసారి కప్పును (CPL 2025) ముద్దాడింది. నికోలస్ పూరన్ నాయకత్వంలోని నైట్‌రైడర్స్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో గయానా అమెజాన్ వారియర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. గయానా బ్యాటర్లలో ఇఫ్తికార్ అహ్మద్ (27 బంతుల్లో 30 పరుగులు), బెన్ మెక్‌డెర్మాట్ (17 బంతుల్లో 28 పరుగులు), డ్వైన్ ప్రిటోరియస్ (18 బంతుల్లో 25 పరుగులు) రాణించారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్ మూడు వికెట్లు తీశాడు. అకేల్ హోసిన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఉస్మాన్ తారిఖ్, ఆండ్రీ రస్సెల్ లు చెరో వికెట్ పడగొట్టాడు.
TRINBAGO KNIGHT RIDERS ARE THE CPL CHAMPIONS OF 2025. 🏆 pic.twitter.com/1PKGLsyP8R
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2025
అనంతరం 131 పరుగుల లక్ష్యాన్ని ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 18 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి అందుకుంది. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో అలెక్స్ హేల్స్ (34 బంతుల్లో 26 పరుగులు), కొలిన్ మున్రో (15 బంతుల్లో 23 పరుగులు), సునీల్ నరైన్ (17 బంతుల్లో 22 పరుగులు), కీరన్ పొలార్డ్ (12 బంతుల్లో 21 పరుగులు) సమయోచితంగా రాణించారు.
టోర్నీ ఆసాంతం మెరుపులు మెరిపించిన కెప్టెన్ నికోలస్ పూరన్ (1) ఫైనల్ మ్యాచ్‌లో విఫలం అయ్యాడు. గయానా బౌలర్లలో కెప్టెన్ ఇమ్రాన్ తాహిర్ మూడు వికెట్లు తీశాడు. డ్వైన్ ప్రిటోరియస్, షమర్ జోసెఫ్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.