పానీ పూరీ కుర్రాడు..సిక్సుతో సెంచరీ కొట్టిన యశస్వి జైస్వాల్

వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్.. 173పరుగుల లక్ష్యం. భారత్ తరపున బరిలోకి దిగాడు య‌శ‌స్వి జైశ్వాల్. టోర్నీలో తొలి సెంచరీ నమోదు చేయడమే కాదు.. మరో ఎండ్ లో ఉన్న పార్టనర్‌తో సక్సేనాతో కలిసి లక్ష్యాన్ని చేధించాడు. బౌలర్లపై విరుచుకుపడుతూ.. 113బంతుల్లో 105పరుగులు (8ఫోర్లు, 4సిక్సులు)తో చెలరేగాడు. వీరోచిత ప్రదర్శనకు జైస్వాల్‌ను ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరించింది. 

ఐపీఎల్ వేలంలో రెండున్నర కోట్ల రూపాయలు పలికిన జైస్వాల్‌పై నెలకొన్న అంచనాలను నిజం చేశాడు. ఈ 17 ఏళ్ల ఈ ముంబై కుర్రాడి గతం గురించి తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. కొన్నేళ్ల కిందట రోడ్డు ప‌క్క‌న పానీ పూరి అమ్మి రోజులు గడిపాడు. ఉత్తరప్ర‌దేశ్‌లో పేద కుటుంబానికి చెందిన యశస్వి 11 ఏళ్ల వయసులో క్రికెటర్‌ కావాలనే కోరికతో ముంబైకి చేరుకున్నాడు. 

తలదాచుకోవడానికి టెంట్‌లో మూడేళ్లు గడిపాడు. బతకడానికి దొరికిన ప్రతి పని చేశాడు. ఆజాద్‌ మైదానం చుట్టుపక్కల పానీపూరీలు, పండ్లు అమ్మాడు. ఈ క్రమంలో అదే మైదానంలో ప్రాక్టీస్‌ చేస్తూ తనని తాను తీర్చిదిద్దుకున్నాడు. రెండేళ్లుగా దేశ‌వాళీల్లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ ఇటీవ‌లే అండ‌ర్‌^19 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులోకి కూడా ఎంపిక‌య్యాడు య‌శ‌స్వి. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ అత‌ణ్ని ఏకంగా రూ.2.5 కోట్ల‌కు కొనుక్కుంది.