Vinesh Phogat not to return home until announcement of CAS decision
Vinesh Phogat disqualification : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) లో అప్పీల్ చేసింది. తనకు రజత పతకం ఇవ్వాలని కోరింది. వినేశ్ ఫోగట్ అప్పీల్ పై సీఏఎస్ తీర్పును వాయిదా వేసింది. దీంతో తీర్పు వచ్చే వరకు వినేశ్ భారత్ వచ్చే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది. అప్పటి వరకు ఆమె పారిస్‌లోనే ఉండనున్నట్లు ఆంగ్ల మీడియాకి సంబంధిత వర్గాలు తెలిపాయి.
పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 50 కేజీల ప్రీస్ట్రైల్ విభాగంలో వినేశ్ ఫోగట్ అసాధారణ ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఆమెకు స్వర్ణం లేదంటే రజతం అయినా వస్తుందని అంతా భావించారు. అయితే.. ఫైనల్ బౌట్‌కు కొన్ని గంటల ముందు 100 గ్రాముల అధిక బరువు ఉందని ఆమె పై అనర్హత వేటు వేసింది.
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ రూల్స్ ప్రకారం.. డిస్‌క్వాలిఫై అయిన రెజ్లర్‌కు చివరి ర్యాంక్ ఇస్తారు. దీంతో వినేశ్‌కు ఎటువంటి పతకం రాకుండా పోయింది.
అనర్హత వేటుపై వినేశ్ ఫోగట్ సీఏఎస్‌ను ఆశ్రయించింది. ఇప్పటికే వాదనలు పూర్తి అయ్యాయి. అయితే తీర్పు వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఆగస్టు 16న తీర్పును వెల్లడించనున్నట్లు తెలిపింది. అయితే.. వాయిదా వేయడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.