వినేశ్ పొగట్ ఓవర్ వెయిట్ వివాదం.. రోహిత్ శర్మపై నెటిజన్ల కామెంట్లు
కేవలం 100 గ్రాముల ఓవర్ వెయిట్ ఉన్నందుకు రెజ్లర్ వినేశ్ పొగట్ను అనర్హురాలిగా ప్రకటించడం కరెక్ట్ కాదని.. ఓవర్ వెయిట్ ఉన్నా కూడా క్రికెట్లో రోహిత్ శర్మ దుమ్మురేపుతున్నాడని..
- Naga Srinivasa Rao Poduri
- Updated on- August 8, 2024 / 06:07 PM IST
Vinesh Phogat – Rohit Sharma: ఇండియా స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ పొగట్ ఓవర్ వెయిట్ కారణంగా పారిస్ ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయింది. నిర్దేశిత వెయిట్ కంటే 100 గ్రాములు అధిక బరువు ఉండడంతో ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది ఒలింపిక్స్ కమిటీ. దీంతో ఈ టాపిక్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేవలం 100 గ్రాముల ఎక్కువ వెయిట్కే ఇంటికి పంపిచేస్తారా అంటూ ఇండియన్స్ ఫైర్ అవుతున్నారు. మరికొంత మంది మాత్రం నిబంధనలు ఎవరికైనా ఒకటేనని, కచ్చితంగా పాటించాల్సిందేనని అంటున్నారు. మరికొందరైతే ఈ వివాదంలోకి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను కూడా లాగుతున్నారు. క్రికెట్లో నిర్దేశిత వెయిట్ నిబంధన లేకపోవడం మంచిదైందని కొంతమంది నెటిజనులు అభిప్రాయపడ్డారు.
“అదృష్టవశాత్తూ, క్రికెట్ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ ప్రతిరోజూ తన వెయిట్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేద”ని బెనెడిక్ట్ అనే నెటిజన్ ఎక్స్‌లో కామెంట్ చేశారు. “రోహిత్ శర్మ చాలా ఏళ్లుగా అధిక బరువుతో ఆడుతున్నాడు. వినేష్ పొగట్ కేవలం 100 గ్రాముల ఓవర్ వెయిట్ ఉన్నందుకు ఆమెను అనర్హురాలిగా ప్రకటించారని మరో నెటిజన్ పేర్కొన్నారు. “భారతీయులకు క్రికెటే కావాలి, బాడీ వెయిట్ పట్టింపు లేదు. మన కెప్టెన్ రోహిత్ శర్మ 45 కిలోల అధిక బరువు ఉన్నా కూడా బంతిని బలంగా కొడతాడ”ని ధర్మేశ్ అనే యూజర్ పేర్కొన్నారు.
కాగా, రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై గతేడాది ఫిబ్రవరిలో క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్ విమర్శలు చేశారు. బాడీ వెయిట్ తగ్గించుకోవాలని కూడా సలహాయిచ్చారు. క్రీడాకారులకు ఫిట్నెస్ చాలా ముఖ్యమని, కెప్టెన్‌గా ఉన్న ప్లేయర్ కచ్చితంగా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మ గొప్ప బ్యాటర్, కెప్టెన్.. కానీ ఫిట్నెస్ పరంగా చూస్తే కొంచెం వెయిట్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తాడని అన్నారు. విరాట్ కోహ్లి ఫిట్‌గా ఉంటాడని కితాబిచ్చారు.
Also Read : శ్రీలంకతో వన్డే సిరీస్ ఓటమి.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. ప్రపంచం మునిగిపోదు..
కాగా, క్రీడాకారులకు వయసు పెరిగేకొద్ది ఆట తగ్గిపోతుందని, కానీ రోహిత్ శర్మ మాత్రం ఇందుకు భిన్నంగా లేటు వయసులోనూ బ్యాటింగ్ ఇరగదీస్తున్నాడని హిట్‌మాన్ ఫ్యాన్స్ అంటున్నారు. తాజాగా ముగిసిన శ్రీలంక వన్డే సిరీస్‌లో రోహిత్ ఒక్కడే రాణించాడు. కోహ్లి సహా మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో రోహిత్ శర్మపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
