Virat Kohli : బయట నుంచి విమర్శించడం తేలిక.. : స్ట్రైక్‌రేట్ కామెంట్ల పై మండిపడ్డ విరాట్ కోహ్లి
వరుసగా ఆరు ఓటముల తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 17వ సీజన్‌లో పుంజుకుంది.
- Thota Vamshi Kumar
- Published On : April 29, 2024 / 02:57 PM IST
PIC credit @ ANI
Virat Kohli strike rate : వరుసగా ఆరు ఓటముల తరువాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 17వ సీజన్‌లో పుంజుకుంది. వరుసగా రెండు మ్యాచుల్లోనూ గెలిచింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ మొదట బ్యాటింగ్ చేసింది. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్ ), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58) అర్ధశతకాలు సాధించడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.
అనంతరం లక్ష్యాన్ని బెంగళూరు ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 16 ఓవర్లలో ఛేదించింది. విల్ జాక్స్ (41 బంతుల్లో 100 నాటౌట్) విధ్వంసకర శతకం బాదాడు. విరాట్ కోహ్లి (44 బంతుల్లో 70నాటౌట్) సమయోచిత మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కాగా.. ఈ మ్యాచ్ అనంతరం విరాట్ మాట్లాడుతూ తన పై వస్తున్న విమర్శలపై గట్టిగానే స్పందించాడు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సీజన్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. అయినా సరే అతడి స్ట్రైక్‌రేట్ తక్కువగా ఉంటుందని కామెంట్లు వస్తున్నాయి. దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్‌తో పాటు పలువురు కోహ్లి స్ట్రైక్‌రేటుపై కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై విరాట్ స్పందిస్తూ.. తాను స్పిన్ సరిగా ఆడలేనని, స్ట్రైక్‌రేటు తక్కువగా ఉందని కామెంట్లు చేసేవారికి ఆటపై పెద్దగా అవగాహన ఉండి ఉండదన్నాడు.
బయట కూర్చొని కామెంట్లు చేసే వారికి మ్యాచ్ పరిస్థితి గురించి తెలియదన్నాడు. మ్యాచ్‌లో విజయం సాధించేందుకే ఆడతానన్నాడు. అలా ఆడతాను కాబట్టే 15 ఏళ్లుగా జట్టులో కొనసాగుతున్నానని చెప్పాడు.
IPL 2024 : రిషబ్ పంత్‌కు బిగ్‌షాక్.. ఒక మ్యాచ్ నిషేధం తప్పదా.. ఎందుకంటే..?
అభిమానులు తన నుంచి మెరుగైన ప్రదర్శన ఆశించడంలో ఎలాంటి తప్పులేదన్నాడు. అయితే తన వరకు మ్యాచ్ పరిస్థితి బట్టే ఆడతానన్నాడు. ఇక ఉన్నత స్థాయిలో క్రికెట్ ఆడిన వారు ఎవరు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు. తెలిసీతెలియని వారే విమర్శలు చేస్తుంటారని చెప్పుకొచ్చాడు. తాను బయట నుంచి వచ్చే కామెంట్లను పట్టించుకోనని, వారిపై దృష్టి సారిస్తే ఏకాగ్రత్త కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చాడు.
