Wasim Jaffer : ఐపీఎల్‌లో ఆ రూల్‌ను తీసేయండి.. లేదంటే భార‌త క్రికెట్‌కు పెను ముప్పు త‌ప్ప‌దు..!

Wasim Jaffer On IPL Impact Player Rule : ఐపీఎల్‌లోని ఓ రూల్ టీమ్ఇండియాకు చేటు చేస్తుంద‌ని టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు వ‌సీం జాఫ‌ర్ అంటున్నాడు.

Wasim Jaffer

టీమ్ఇండియా మాజీ ఆట‌గాడు వ‌సీం జాఫ‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ భార‌త జ‌ట్టును, ఆట‌గాళ్ల‌ను విమ‌ర్శించే ప్ర‌త్య‌ర్థి మాజీ క్రికెట‌ర్ల‌కు త‌న‌దైన శైలిలో చుర‌క‌లు అంటిస్తుంటాడు. అలాగే మ‌న జ‌ట్టు ఆట‌తీరును కూడా విశ్లేషిస్తుంటాడు. అందుకనే జాఫ‌ర్ చేసే ట్వీట్ల కోసం నెటీజ‌న్లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. తాజ‌గా ఈ మాజీ ఆట‌గాడు చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లోని ఓ రూల్ టీమ్ఇండియాకు చేటు చేస్తుంద‌ని అంటున్నాడు. ఈ నిబంధ‌న కార‌ణంగా ఆల్‌రౌండ‌ర్ల సంఖ్య త‌గ్గిపోతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. డిసెంబ‌ర్ 19న దుబాయ్ వేదిక‌గా ఐపీఎల్ మినీ వేలం జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రూల్ గురించి ఓ సారి ఆలోచించాల‌ని సూచిస్తున్నాడు. ఇంత‌కీ ఆ నిబంధ‌న ఏంట‌ని అంటారా..? అదే ఇంపాక్ట్ ప్లేయ‌ర్ నిబంధ‌న‌.

ఆల్‌రౌండ‌ర్ల‌ను ప్రోత్స‌హించ‌దు..

‘ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్ నిబంధ‌న‌ను తొల‌గించాలి. ఎందుకంటే ఇది ఆల్‌రౌండ‌ర్ల‌ను ఎక్కువ‌గా ప్రోత్స‌హించ‌దు. దీని వ‌ల్ల ఆల్‌రౌండ‌ర్లు మెరుగ్గా బౌలింగ్ గానీ, బ్యాటింగ్ గానీ చేయ‌లేక‌పోతున్నారు. ఇది భార‌త క్రికెట్‌కు స‌మ‌స్య‌గా మారుతుంది.’ అని జాఫ‌ర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.

ఆల్ రౌండర్ల వినియోగానికి ఆటంకం కలిగిస్తున్నందున ఈ ఐపీఎల్ నిబంధనను తొలగించాలని మాజీ బ్యాటర్ అన్నారు. దేశవాళీ క్రికెట్‌లో కూడా ఈ నియమాన్ని ఉపయోగించడం వల్ల, భవిష్యత్తులో ఆల్‌రౌండర్లు అనే వారు క‌నుమ‌రుగు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఇది భార‌త క్రికెట్‌కు చేటు చేస్తుంద‌ని అభిప్రాయ ప‌డ్డాడు.

ద‌క్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండ‌ర్ క‌లిస్ సైతం..

దక్షిణాఫ్రికా మాజీ దిగ్గ‌జ ఆట‌గాడు జాక్వెస్ క‌లిస్ సైతం ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్ ను వ్య‌తిరేకిస్తున్నాడు చెప్పాడు. ఈ నిబంధ‌న వ‌ల్ల జ‌ట్టులో ఆల్‌రౌండ‌ర్లు చోటు కోల్పోతున్నార‌న్నాడు. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌తో జ‌ట్టులో 12 మంది అవుతున్నార‌ని, దీని వ‌ల్ల ఆల్‌రౌండ‌ర్ల ప్రాముఖ్యం త‌గ్గుతుంద‌న్నాడు.

ట్రెండింగ్ వార్తలు