West Indies : వన్డే ప్రపంచకప్ 2027కి నేరుగా అర్హత సాధించడంలో విఫలమైన వెస్టిండీస్.. అయినా గానీ..
ఒకప్పుడు వన్డే క్రికెట్‌ను శాసించింది వెస్టిండీస్ జట్టు(West Indies). వరుసగా రెండు వన్డే ప్రపంచకప్‌లను (1975, 1979) సాధించింది.
- Thota Vamshi Kumar
- Updated on- August 11, 2026 / 09:04 AM IST
West Indies Fail To Secure Direct World Cup 2027 Qualification
West Indies : ఒకప్పుడు వన్డే క్రికెట్‌ను శాసించింది వెస్టిండీస్ జట్టు. వరుసగా రెండు వన్డే ప్రపంచకప్‌లను (1975, 1979) సాధించింది. అయితే.. ఇప్పుడు ఆ జట్టు ప్రదర్శన తీసికట్టుగా మారింది. ఇటీవల కాలంలో వన్డే ప్రపంచకప్‌లలో ఆ జట్టు ప్రదర్శన అటుంచితే కనీసం ఈ మెగాటోర్నీకి అర్హత సాధించేందుకు కూడా ఆపసోపాలు పడుతోంది.
వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, జింబాబ్వే వేదికగా వన్డే ప్రపంచకప్ 2027 జరగనుంది. ఈ మెగాటోర్నీకి నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని వెస్టిండీస్ మరోసారి కోల్పోయింది. ఐసీసీ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో నిలిచిన జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు కూడా నేరుగా చోటు లభిస్తుంది. అయితే వెస్టిండీస్ ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో లేదు. తాజాగా బెల్‌ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత వన్డే మ్యాచ్‌లో విజయం సాధించిన అఫ్గానిస్థాన్ టాప్-8కి చేరుకుంది.
ప్రస్తుతం ఉన్న ర్యాంకింగ్స్ ఆధారంగా.. ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లు నేరుగా అర్హత సాధించాయి. వీటితో పాటు ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వే లు వన్డే ప్రపంచకప్ 2027లో చోటు దక్కించుకున్నాయి.
సెప్టెంబర్ 30కి ముందు వెస్టిండీస్ మరో రెండు వన్డేలు మాత్రమే ఆడనుంది. ఆ రెండు మ్యాచ్‌లు కూడా భారత్‌తోనే ఆడాల్సి ఉంది. ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించినా కూడా అఫ్గానిస్థాన్‌ను వెనక్కి నెట్టి వెస్టిండీస్ వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించే అవకాశాలు లేవు.
నాలుగేళ్ల క్రితం కూడా ఇదే పరిస్థితి..
సరిగ్గా.. నాలుగేళ్ల క్రితం కూడా వెస్టిండీస్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. అప్పట్లో ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే క్వాలిఫయర్స్‌లో రాణించాల్సి వచ్చింది. కానీ క్వాలిఫయర్స్‌లోనూ విఫలం కావడంతో తొలిసారి వారు వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయారు.
2027 ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు వెస్టిండీస్ ఇంకో ఛాన్సు ఉంది?
వన్డే ప్రపంచకప్ 2027కి నేరుగా అర్హత సాధించే అవకాశం కోల్పోయిన వెస్టిండీస్ ఇప్పుడు 10 జట్ల ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో వెస్టిండీస్‌తో పాటు ఐర్లాండ్, CWC లీగ్-2లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్లు, క్వాలిఫయర్ ప్లేఆఫ్స్ నుంచి అర్హత సాధించిన జట్లు పాల్గొంటాయి.
క్వాలిఫయర్ ప్లేఆఫ్స్‌లో CWC లీగ్-2లో దిగువన నిలిచిన నాలుగు జట్లతో పాటు ఛాలెంజ్ లీగ్‌లోని రెండు గ్రూపుల నుంచి టాప్-2లో నిలిచిన జట్లు పాల్గొంటాయి. మొత్తం ఎనిమిది జట్ల మధ్య జరిగే ఈ పోటీలో టాప్-4లో నిలిచిన జట్లు ప్రధాన క్వాలిఫయర్‌కు అర్హత సాధిస్తాయి.
వెస్టిండీస్ 2027 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోవాలంటే ప్రధాన క్వాలిఫయర్‌లో చాంపియన్‌గా నిలవడం అత్యంత సులభమైన మార్గం. క్వాలిఫయర్ టోర్నమెంట్‌ను గెలిస్తే నేరుగా ప్రపంచకప్‌కు అర్హత లభిస్తుంది.
అలా కాకుండా రెండో, మూడో లేదా నాలుగో స్థానాల్లో నిలిచినా వెస్టిండీస్‌కు మరో అవకాశం ఉంటుంది. ఆ జట్లు ‘సూపర్ సిరీస్’ ప్లేఆఫ్ దశకు అర్హత సాధిస్తాయి. ఈ దశలో విజేతగా నిలిచిన జట్టు ప్రపంచకప్‌లో మిగిలిన చివరి బెర్త్‌ను దక్కించుకుంటుంది. అయితే ఈ ప్లేఆఫ్ దశకు సంబంధించిన పూర్తి ఫార్మాట్‌ను ఐసీసీ ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.
మొత్తంగా చూస్తే.. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ ఇప్పుడు 2027 వన్డే ప్రపంచకప్‌లో చోటు కోసం సుదీర్ఘమైన క్వాలిఫయింగ్ మార్గాన్ని అధిగమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
