హరియాణాలోని గురుగ్రామ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నేషనల్ టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్‌పై ఆమె తండ్రి దీపక్ యాదవ్ తుపాకీతో ఐదు రౌండ్లు కాల్పులు జరిపి చంపాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
గురుగ్రామ్ సుషాంత్ లోక్-ఫేజ్ 2లోని రాధిక నివాసం నుంచి ఆమెను తుపాకీ గాయాలతో ఆసుపత్రికి తీసుకురాగానే ఆమె మృతి చెందింది. అక్కడి చేరుకున్న పోలీసులు ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. ఆమె టెన్నిస్ అకాడమీ నడుపుతున్నట్టు గుర్తించారు.
ప్రాథమిక దర్యాప్తులోనే దీపక్ హత్య చేసిన విషయాన్ని ఒప్పుకున్నాడు. మొదటి ఫ్లోర్లో నివసిస్తున్న దీపక్ సోదరుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాధిక టెన్నిస్ అకాడమీ నడుపుతున్నందుకు దీపక్ ఆగ్రహంతో ఉండేవాడు. అకాడమీ మూసివేయాలని ఒత్తిడి చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతడు హత్యకు ఉపయోగించిన తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
రాధికా యాదవ్ ఎవరు?
రాధికా యాదవ్ 2000 మార్చి 23న జన్మించింది. టెన్నిస్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో పలు టోర్నీల్లో రాణించి తనదైన ముద్ర వేసింది. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ITF) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 113వ స్థానంలో నిలిచింది. గ్లోబల్ లెవెల్లో కూడా డబుల్స్ విభాగంలో టాప్ 200లో స్థానం దక్కించుకుంది. హరియాణాలో మహిళల డబుల్స్‌లో ఐదవ స్థానంలో ఉంది.
కాగా, రాధికా మాజీ కోచ్‌గా మనోజ్ భారద్వాజ్ ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఆమె చాలా క్రమశిక్షణ పాటించేది. లక్ష్యంపై పూర్తిగా దృష్టి పెట్టేది. ఆమెను కోల్పోయి చాలా నష్టపోయాం” అని వ్యాఖ్యానించారు.