WI vs PAK 3rd ODI Shai Hope 120 Pakistan 92 all out fans troll Pakistan
Fans troll Pakistan : అనిశ్చితికి మారు పేరు పాకిస్తాన్ క్రికెట్ జట్టు. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవ్వరికి తెలియదు. ఓ మ్యాచ్‌లో రికార్డు ఛేజింగ్ చేస్తే మరో మ్యాచ్‌లో పసికూన కంటే దారుణమైన ప్రదర్శన చేస్తూ ఉంటుంది. ఆ జట్టు బ్యాటర్లు కూడా అంతే.. ఎవరు ఏ మ్యాచ్‌లో ఎలా ఆడతారో కూడా చెప్పలేని పరిస్థితి. నిలకడ లేమీ టీమ్‌గా పాక్‌కు పేరుంది.
తాజాగా వెస్టిండీస్ పర్యటనలో ఆ జట్టుకు గట్టి షాక్ తగిలింది. టీ20 సిరీస్‌ను గెలిచినప్పటికి కూడా వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయింది. 34 ఏళ్ల తరువాత పాక్ పై విండీస్ వన్డే సిరీస్‌ను గెలవడం గమనార్హం.
వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో పాక్ గెలవగా, రెండో మ్యాచ్‌లో విండీస్ విజయం సాధించింది. దీంతో మూడో మ్యాచ్ కీలకంగా మారింది. ఈ కీలక మ్యాచ్‌లో పాక్ జట్టు పై విండీస్ 202 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
శతకంతో చెలరేగిన షైహోప్..
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో కెప్టెన్ షై హోప్ (94 బంతుల్లో 120 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు. జస్టిన్ గ్రీవ్స్ (24 బంతుల్లో 43 పరుగులు), ఎవిన్ లూయిస్ (54 బంతుల్లో 37 పరుగులు), రోస్టన్ చేజ్ (29 బంతుల్లో 36 పరుగులు) రాణించారు. పాక్ బౌలర్లలో నసీమ్ షా, అబ్రార్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సైమ్ అయూబ్, మొహమ్మద్ నవాజ్ లు తలా ఓ వికెట్ సాధించారు.
ఆతరువాత 295 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 29.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో సల్మాన్ అఘా (30), మహ్మద్ నవాజ్ (23), హసన్ నవాజ్ (13) లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారిలో ఐదుగురు బ్యాటర్లు డకౌట్లు కావడం గమనార్హం. ఇందులో కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ సైతం ఉన్నాడు. స్టార్ ఆటగాడు బాబర్ ఆజాం కూడా 9 పరుగులే పెవిలియన్‌కు చేరుకున్నాడు.
Worst Leave Of The Year : వరస్ట్ లీవ్ ఆఫ్ ది ఇయర్.. రిజ్వాన్ క్లీన్ బౌల్డ్ వీడియో వైరల్..
విండీస్‌తో మూడో వన్డేలో కనీసం 100 పరుగులైనా చేయని పాక్ జట్టు పై సొంత అభిమానులు కూడా విమర్శల వర్షం (Fans troll Pakistan) కురిపిస్తున్నారు. షై హోప్ 120 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అది కూడా 94 బంతుల్లోనే. ఇక పాక్ జట్టు మొత్తంగా కూడా అతడు స్కోరును కాదు గదా.. అతడు ఆడినన్ని బంతుల సంఖ్యను చేరుకోలేదు. ఈ జట్టు ఆసియా కప్‌ను గెలుస్తుందా అని కామెంట్లు చేస్తున్నారు.