WPL 2025: ఉత్కంఠభరిత పోరులో మూడోసారీ ఢిల్లీకి నిరాశే.. డబ్ల్యూపీఎల్-2025 ఛాంపియ‌న్‌గా ముంబై ఇండియన్స్‌

వరుసగా మూడోసారీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నిరాశే ఎదురైంది. గత రెండు సీజన్లలో ఫైనల్స్ వరకు దూసుకొచ్చిన ఢిల్లీ జట్టు..

Mumbai Indians

WPL 2025 Winner Mumbai Indians: వరుసగా మూడోసారీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నిరాశే ఎదురైంది. గత రెండు సీజన్లలో ఫైనల్స్ వరకు దూసుకొచ్చిన ఢిల్లీ జట్టు.. ఛాంపియన్ గా నిలవడంలో విఫలమైంది. ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 లీగ్ లోనూ ఢిల్లీకి అదే పరిస్థితి ఎదురైంది. దీంతో వరుసగా మూడోసారి ఫైనల్స్ లో ఓడిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ రికార్డు నెలకొల్పింది. మరోవైపు డబ్ల్యూపీఎల్ లో రెండోసారి ముంబై ఇండియన్స్ ఛాంపియన్ గా నిలిచింది. ఆధిత్యం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది.

 

శనివారం రాత్రి బ్రబోర్న్ స్టేడియంలో డబ్ల్యూపీఎల్ -2025 ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. టాస్ ఓడిన తరువాత ముంబై జట్టు ముందుగా బ్యాటింగ్ కు వచ్చింది. ఆరంభంలోనే ముంబై జట్టు రెండు కీలక వికెట్లు పోగొట్టుకుంది. అయితే, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, నాట్ స్కీవర్ బ్రంట్ 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హర్మన్ ప్రీత్ (44 బంతుల్లో 9ఫోర్లు, రెండు సిక్సులతో 66) పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. మరోవైపు నాట్ స్కీవర్ 30 పరుగులు చేసింది. దీంతో ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు ఆరంభం నుంచి వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది.

 

ఈ సీజన్ లో పెద్ద పెద్ద లక్ష్యాలను కూడా సునాయాసంగా ఛేదించిన ఢిల్లీ జట్టు ఫైనల్లో ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో తడబడింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మారిజాన్ కాప్ (40), జెమీమా రోడ్రిగ్స్ (30), నికి ప్రసాద్ (25నాటౌట్) మినహా పెద్దగా ఎవరూ రాణించలేదు. చివరిలో పరిస్థితి ఎలా మారిందంటే.. చివరి ఓవర్లో ఢిల్లీకి ఒక వికెట్ మాత్రమే మిగిలి ఉంది. విజయం సాధించాలంటే 14 పరుగులు చేయాలి. ఢిల్లీ వరుసగా పరుగులు తీసుకుంటూనే ఉంది. ఫలితంగా లక్ష్యం 1 బంతికి 10 పరుగులుగా మారింది. చివరి బంతికి కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు ఎనిమిది పరుగుల తేడాతో మ్యాచ్ విన్నర్ గా మారింది. అయితే, ముంబై ఇండియన్స్ డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలుచుకోవడం ఇది రెండోసారి.

డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ 2023లో ముంబై విజయం సాధించింది. ఆ తరువాత 2024లో ఆర్సీబీ విజేతగా నిలిచింది. మళ్లీ 2025లోనూ ముంబై విజేతగా నిలిచింది. ఇదిలాఉంటే మూడు సీజన్ లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్స్ కు చేరింది. మూడుసార్లు ఫైనల్స్ లో రన్నరప్ గానే నిలిచింది.