Womens world cup Final
Womens world cup Final: మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఫైట్ ఆసక్తి రేపుతోంది. టీమిండియా తొలిసారి కప్‌ను సగర్వంగా అందుకోవాలని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ముంబై డీవై పాటిల్ స్టేడియంలో.. దక్షిణాఫ్రికాతో భారత జట్టు ఫైనల్ ఫైట్‌లో తలపడనుంది. మధ్యాహ్నం 3గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. తుది పోరులో ఎవరు గెలిచినా ఆ జట్టుకు ఇదే మొదటి ప్రపంచకప్. టీమిండియా గెలిచినా.. ఓడినా ఈ సారి కొత్త ఛాంపియన్ అవతరించనుంది. తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. దీంతో ఇవాళ్టి ఫైనల్ పోరు మరింత ఆసక్తి రేపుతోంది.
సొంతగడ్డపై చరిత్ర క్రియేట్ చేస్తారా..
హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు.. కప్ నెగ్గి సొంత గడ్డపై సరికొత్త చరిత్ర క్రియేట్ చేయాలనే కసితో కనిపిస్తోంది. మరోవైపు లారా వోల్వార్డ్‌తో కూడిన సౌతాఫ్రికా జట్టుకూడా బలంగా ఉంది. సెమీఫైనల్‌లో భారత మహిళా జట్టు అద్భుతంగా రాణించి ఫైనల్ చేరింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 పరుగుల భారీ లక్ష్యాన్ని.. కేవలం 5 వికెట్లు కోల్పోయి ఛేదించి అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ స్కోర్ ఛేజింగ్ మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద రన్ ఛేజ్ రికార్డును క్రియేట్ చేసింది. ఇది టీమిండియా సత్తాను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటింది. 8ఏళ్లుగా వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా విజయాలకు అడ్డుకట్ట వేయడం.. ఫైనల్‌కు ముందు భారత్ ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికి పెంచింది. ఇదే ఉత్సాహంతో ఇప్పుడు ఫైనల్ ఫైట్‌కు రెడీ అవుతోంది.
వీళ్లు రాణిస్తే విజయం సునాయాసం..
స్మృతీ మందానా, జెమిమా రోడ్రిగ్స్, షెఫాలి వర్మ మంచి ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. ఇక దీప్తి శర్మ, స్నేహ్ రాణా, రాధా యాదవ్‌లాంటి స్పిన్నర్లు భారత పిచ్‌లలో కీలక పాత్ర పోషించే చాన్స్ ఉంది. ఇక ఫైనల్‌లో స్పిన్ బౌలింగ్‌లో సత్తా చాటే జట్టు.. ఆధిపత్యం సాధించే అవకాశాలు ఉన్నాయి. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్‌లో.. హోమ్ అడ్వాంటేజ్‌ను సద్వినియోగం చేసుకోని ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాలని హర్మన్ సేన టార్గెట్ పెట్టుకుంది.
రెండు సార్లు చేజారిన కప్..
47 ఏళ్ల మహిళల వన్డే చరిత్రలో.. భారత జట్టు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేకపోయింది. 2005, 2017 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ వరకు వెళ్లినా.. చివరి మెట్టుపై బోల్తాపడింది. 2005లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. 2017లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఏ మెగా ఫైనల్‌లో.. బ్రిటీష్ టీమ్ చేతిలో పరాజయం పాలైంది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు చేరుకుంది. మరి ఇప్పుడు టీమిండియా తన కలను నెరవేర్చుకుంటుందా.. తొలిసారి ప్రపంచ కప్‌ను ముద్దాడుతుందా.. మహిళల క్రికెట్ చరిత్రలో తమ పేరు లిఖించుకుంటుందా.. చూడాలి మరి. అయితే, సెమీస్‌లో చూపించిన దూకుడు మరోసారి ప్రదర్శిస్తే.. కప్ ముద్దాడడం భారత జట్టుకు పెద్ద మ్యాటరే కాదు. ఇదే ఇప్పుడు కోట్ల మంది క్రికెట్ అభిమానుల అభిప్రాయం, నమ్మకం కూడా.
ఆమెను కట్టడి చేస్తేనే..
2005 వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాపై భారత్ చివరిసారి గెలిచింది. ఆ తర్వాత జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఓడిపోయింది. ఇది అభిమానులను టెన్షన్ పెడుతోంది. రెండు జట్ల మధ్య ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో రెండు జట్లు.. తలో మూడుసార్లు గెలిచాయి. 2005లో భారత్ చివరి విజయం తర్వాత.. సౌతాఫ్రికా వరుసగా 3 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇక సౌతాఫ్రికా సౌతాఫ్రికా జట్టు ప్రధాన బలం కెప్టెన్ లారా వాల్వార్ట్. ఈ ప్రపంచ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టాప్‌లో ఉంది. ఆమెను కట్టడి చేయగలిగితే మిగతా వారిని అడ్డుకోవడం ఈజీ అవుతుంది. నదినె డి క్లార్క్, ట్రైయన్ కూడా డేంజరేస్ బ్యాటర్లే. ఈ టోర్నీలో టీమిండియా, సౌతాఫ్రికా జట్లు ఒకసారి తలపడ్డాయి. ఇందులో సఫారీ జట్టే విజయాన్ని సాధించింది.
ఆస్ట్రేలియాపై విజయంతో ఆత్మవిశ్వాసంతో బరిలోకి..
గ్రూప్ దశలో 7 మ్యాచ్‌లు ఆడిన హర్మన్ సేన.. మూడింట్లో గెలిచి.. మూడింట్లో ఓడింది. టోర్నమెంట్ స్టార్టింగ్‌లో కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ.. కీలకమైన సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాలాంటి బలమైన జట్టుపై విజయం సాధించి.. టైటిల్ వేటలో శక్తిని ప్రూవ్ చేసుకుంది. జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు, యువ ఆటగాళ్ల నిలకడైన ప్రదర్శన టీమిండియాకు ప్రధాన బలం. సొంత మైదానంలో ప్రేక్షకుల మద్దతు కూడా టీమిండియాకు కలిసొచ్చే అవకాశం ఉంది. సౌతాఫ్రికా జట్టు గ్రూప్ దశలో 7 మ్యాచ్‌లు ఆడి.. ఐదింట్లో గెలిచింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో కెప్టెన్ లారా వాల్వార్ట్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. బౌలింగ్ బలం, ఫీల్డింగ్‌పై ప్రధానంగా దృష్టి సారించి.. తొలి ఫైనల్‌లో ట్రోఫీని గెలవాలని దక్షిణాఫ్రికా జట్టు పట్టుదలతో ఉంది.
భారత్ తుది జట్టు (అంచనా): స్మృతి, షెఫాలి, జెమీమా, హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), దీప్తి, రిచా, అమన్‌జ్యోత్, స్నేహ్/రాధ, శ్రీచరణి, క్రాంతి, రేణుక.
దక్షిణాఫ్రికా తుది జట్టు (అంచనా): లారా వోల్వార్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, అనెకె బోష్, సున్ లుజ్, మరిజేన్ కాప్, సినాలో జఫ్టా, అనెరీ డెర్క్‌సెన్, క్లో ట్రయాన్, నదైన్ డిక్లెర్క్, ఖకా, ఎంలబా