Pujara-Kohli
Pujara-Kohli : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పూణే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ శతకం చేసిన సంగతి తెలిసిందే. వన్డేల్లో ఇది అతడికి 48వ సెంచరీ కావడం విశేషం. అయితే.. అసలు ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ కొడుతాడు అని ఎవ్వరూ కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే విరాట్ కోహ్లీ 74 పరుగుల వద్ద ఉన్నప్పుడు టీమ్ఇండియా విజయానికి 27 పరుగులు మాత్రమే అవసరం. మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్ వంటి ప్రధాన బ్యాటర్ ఉండడంతో విరాట్ శతకం గురించి ఎవ్వరూ ఆలోచించలేదు.
అయితే.. కోహ్లీ మిగిలిన పరుగులు అన్ని చేసి మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. దీంతో విరాట్ ఆట తీరుపై పలు విమర్శలు వచ్చాయి. కేవలం వ్యక్తిగత మైలురాయి కోసమే కోహ్లీ ఆడుతున్నాడు అంటూ పలువురు మండిపడ్డారు. ఇప్పుడు టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్టు, సీనియర్ ఆటగాడు పుజారా సైతం కోహ్లీ శతకం సాధించిన తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. జట్టు ప్రయోజనాలు ముఖ్యమని చెప్పుకొచ్చాడు.
జట్టు ప్రయోజనాలు ముఖ్యం..
విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాలని తాను కోరుకున్నానని, అయితే.. మ్యాచ్‌ను సాధ్యమైనంత త్వరగా ముగించాలన్న విషయాన్ని సైతం మరిచిపోవద్దని చెప్పాడు. ఈ మెగాటోర్నీలో రన్‌రేట్ ఎంతో ముఖ్యమని, మెరుగైన రన్‌రేట్‌ను కలిగి ఉండాలని సూచించాడు. పట్టికలో అగ్రస్థానంలో నిలవాలంటే నెట్‌రన్ రేటు కోసం పోరాడాల్సిన స్థితిలో ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాడు. కోహ్లీతో పాటు మిగతా ఆటగాళ్లు అందరూ వ్యక్తిగత రికార్డుల కంటే జట్టుకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నాడు.
ఆటగాళ్లు మైండ్ సెట్‌ను బట్టి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పాడు. ‘ప్లేయర్లకు వ్యక్తిగత మైలురాళ్లు అవసరమే. అయితే.. జట్టు ప్రయోజనాలకు ఇది ఇబ్బంది కలిగించకూడదు. కొందరు ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే అది తదుపరి మ్యాచ్‌కు ఉపయోగ పడుతుందని భావిస్తుంటారు. అయితే.. ఇది సదరు వ్యక్తి మనస్తత్వంపైనే ఆధారపడి ఉంటుంది.’ అని పుజారా అన్నాడు.
ODI World Cup 2023 : విరాట్ కోహ్లీ సెంచరీకి అంపైర్ సాయం చేశాడా..? అది వైడా..? కాదా..?
వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఆడిన నాలుగు మ్యాచుల్లో గెలిచినప్పటికీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ కూడా నాలుగు మ్యాచుల్లో గెలిచినా కూడా మెరుగైన రన్‌రేట్ కారణంగా మొదటి స్థానంలో ఉంది.