World Cup 2023 NZ vs AFG: అఫ్గాన్‌పై న్యూజిలాండ్ విజయ దుందుభి.. పాయింట్ల పట్టికలో భారత్‌ను వెనక్కునెట్టి..

ఐసీసీ వన్డే వరల్డ్ కప్-2023లో భాగంగా చెన్నై వేదికగా న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది.

world cup 2023 nz vs afg odi

అఫ్గానిస్థాన్ పై న్యూజిలాండ్ 149 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 288-6 (50 ఓవర్లకు) స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో అఫ్గాన్ ఏ మాత్రం రాణించలేకపోయింది. 34.4 ఓవర్ల వద్ద 139 పరుగులకే అఫ్గాన్ ఆలౌట్ అయింది. 

దీంతో ప్రపంచ కప్-2023లో పాయింట్ల పట్టికలో మళ్లీ న్యూజిలాండ్ అగ్రస్థానానికి చేరింది. అంతకు ముందు తొలి స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. అయితే, న్యూజిలాండ్ ఇప్పటివరకు నాలుగు మ్యాచులు ఆడి అన్నింట్లోనూ గెలవగా, భారత్ మూడు మ్యాచులు ఆడి ఆ మూడింటిలోనూ గెలిచింది. భారత్ గురువారం బంగ్లాదేశ్ తో ఆడనుంది.

మరో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్థాన్
25.4 ఓవర్ లో 97 పరుగుల వద్ద అఫ్గానిస్థాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ 27 పరుగులు చేసి అవుటయ్యాడు. 27 ఓవర్లలో 106/4 స్కోరుతో అఫ్గానిస్థాన్ ఆట కొనసాగిస్తోంది.

షాహిదీ అవుట్.. మూడో వికెట్ డౌన్
13.6 ఓవర్ లో 43 పరుగుల వద్ద అఫ్గానిస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. హష్మతుల్లా షాహిదీ 8 పరుగులు చేసి అవుటయ్యాడు. 20 ఓవర్లలో 68/3 స్కోరుతో అఫ్గానిస్థాన్ ఆట కొనసాగిస్తోంది.

అఫ్గానిస్థాన్ కు ఆరంభంలోనే షాక్
289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 27 పరుగులకే ఓపెనర్లు ఇద్దరూ అవుటయ్యారు. రహ్మానుల్లా గుర్బాజ్ 11, ఇబ్రహీం జద్రాన్ 14 పరుగులు చేసి అవుటయ్యారు.

5 ఓవర్లలో అఫ్గానిస్థాన్ స్కోరు 19/0
289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ మొదటి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది.

ముగిసిన కివీస్ బ్యాటింగ్
అఫ్గానిస్థాన్ కు న్యూజిలాండ్ 289 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ టీమ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్(71), టామ్ లాథమ్(68) విల్ యంగ్ (54) హాఫ్ సెంచరీలతో రాణించారు. రచిన్ రవీంద్ర 32, మార్క్ చాప్‌మన్ 25, డెవాన్ కాన్వే 20 పరుగులు చేశారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో నవీన్-ఉల్-హక్, అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

6 వికెట్లు కోల్పోయిన కివీస్
47.3 ఓవర్లో 255 పరుగుల వద్ద న్యూజిలాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ 68 పరుగులు చేసి అవుటయ్యాడు.

టామ్ లాథమ్ హాఫ్ సెంచరీ
న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ హాఫ్ సెంచరీ కొట్టాడు. 67 బంతుల్లో 2 ఫోర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. 45 ఓవర్లో 226/4 స్కోరుతో కివీస్ ఆట కొనసాగిస్తోంది.

 

గ్లెన్ ఫిలిప్స్ హాఫ్ సెంచరీ.. 200 దాటిన కివీస్ స్కోరు
42.1 ఓవర్లలో న్యూజిలాండ్ స్కోరు 200 పరుగులు దాటింది. గ్లెన్ ఫిలిప్స్ హాఫ్ సెంచరీ చేశాడు. 69 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. టామ్ లాథమ్ 41 పరుగులతో ఆడుతున్నాడు.

4 వికెట్లు కోల్పోయిన కివీస్
న్యూజిలాండ్ 110 పరుగుల నాలుగో వికెట్ కోల్పోయింది. 35 ఓవర్లో 163/4 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

విల్ యంగ్ హాఫ్ సెంచరీ
న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ హాఫ్ సెంచరీ చేశాడు. 46 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. కివీస్ 20 ఓవర్లో 109/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. విల్ యంగ్ 54, రచిన్ రవీంద్ర 32 పరుగులతో ఆడుతున్నారు.

 

కాన్వే అవుట్.. ఫస్ట్ వికెట్ డౌన్
న్యూజిలాండ్ 30 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డెవాన్ కాన్వే 20 పరుగులు చేసి అవుటయ్యాడు. కివీస్ 14 ఓవర్లలో 70/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే 14, విల్ యంగ్ 8 పరుగులతో ఆడుతున్నారు.

టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్
టాస్ గెలిచి అఫ్గానిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. మ్యాచ్ సెకండాఫ్ లో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించినట్టు అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ తెలిపాడు. న్యూజిలాండ్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేయాలని భావిస్తున్నామని అన్నాడు.

 

తుది జట్లు
న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (కెప్టెన్/కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

అఫ్గానిస్థాన్: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(వికెట్ కీపర్), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హా

ఫుల్ జోష్ లో అఫ్గానిస్థాన్ 
NZ vs AFG: వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా నేడు జరగనున్న 16వ మ్యాచ్ లో న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని MA చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్ లో డిపెండింగ్ చాంపియన్ ను చిత్తు చేసిన అఫ్గానిస్థాన్ ఫుల్ జోష్ లో ఉంది. అదే జోరును ఈ మ్యాచ్ లోనూ కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా మెరుగ్గానే ఉంది. ఇప్పటివరకు 3 మ్యాచ్ లు ఆడిన కివీస్ మూడింటిలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మంచి ఫామ్ లో ఉన్న న్యూజిలాండ్ ను అఫ్గానిస్థాన్ ఏమేరకు నిలువరిస్తుందో చూడాలి.

 

కేన్ విలియమ్సన్ దూరం
కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఎడమ చేతి బొటనవేలు గాయంతో ఈరోజు మ్యాచ్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో వికెట్ కీపర్ టామ్ లాథమ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. కేన్ విలియమ్సన్ ప్లేస్ లో విల్ యంగ్ జట్టులోకి వచ్చే అవకాశముంది. అఫ్గానిస్థాన్ జట్టులో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. ఢిల్లీలో ఇంగ్లండ్‌పై గెలిచిన జట్టుతోనే బరిలోకి దిగే చాన్స్ ఉంది.