World Cup 2023 PAK vs SL ODI
World Cup 2023 PAK vs SL : వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 345 పరుగుల లక్ష్యాన్ని 48.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాకిస్తాన్ బ్యాటర్లలో మహ్మద్ రిజ్వాన్ (134 నాటౌట్; 121 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), అబ్దుల్లా షఫీక్ (113; 103 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాలతో చెలరేగారు. లంక బౌలర్లలో మధుశంక రెండు వికెట్లు, పతిరణ, తీక్షణ చెరో వికెట్ పడగొట్టారు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కుశాల్ మెండీస్ (122; 77 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్స్‌లు), సదీర సమరవిక్రమ (108; 89 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు బాదారు. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (51; 61 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాకిస్తాన్ బౌల్లరలో హసన్ అలీ నాలుగు వికెట్లు తీయగా, హరీస్ రవూఫ్ రెండు, షహీన్ అఫ్రీదీ, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్,లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకకు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్‌లోనే 5 పరుగుల వద్ద కుశాల్ పెరీరా డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ పాతుమ్ నిస్సాంక తో వన్ డౌన్ బ్యాటర్ కుశాల్ మెండీస్ జత కలిశాడు. వీరిద్దరు పాకిస్తాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఈ క్రమంలో 58 బంతుల్లో నిస్సాంక, 40 బంతుల్లో కుశాల్ మెండీస్‌లు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అర్థశతకం అనంతరం నిస్సాంక ఔటైన సరే.. మెండీస్ విధ్వంసం సృష్టించాడు. 65 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఆ తరువాత ధాటిగా ఆడే క్రమంలో పెవిలియన్‌కు చేరుకున్నాడు. మరోవైపు సదీర సమరవిక్రమ ఆరంభంలో ఆచితూచి ఆడాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్న తరువాత ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో 82 బంతుల్లోనే శతకాన్ని అందుకుని జట్టుకు భారీ స్కోరు అందించాడు.