Gautam Gambhir
Gambhir-MSK Prasad : ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని భారత సెలక్షన్ కమిటీ పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలు చేశాడు. టీమ్ఇండియా క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త సెలక్షన్ కమిటీ అది అని గంభీర్ మండిపడ్డాడు. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ.. 2019 వన్డే ప్రపంచకప్ కు జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాగా.. జట్టును ఎంపిక చేసిన ఆ సమయంలోనే సెలక్షన్ కమిటీ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నాలుగో స్థానానికి అనుభవం ఉన్న అంబటి రాయుడిని కాదని, విజయ్ శంకర్‌ను ఎంపిక చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.
ధర్మశాల వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా స్టార్‌స్పోర్ట్ప్‌లో కామెంట్రీ చేస్తూ గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అంబటి రాయుడు ఓ అద్భుతమైన ఆటగాడు అని కితాబు ఇచ్చాడు. నంబర్ ఫోర్ స్థానంలో అతడు రాణించాడని చెప్పుకొచ్చారు. అతడిని ప్రపంచకప్‌కు ఎంపిక చేయడ పోవడం దారుణం అన్నాడు. ‘అతడి స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చారు. నాలుగో స్థానంలో సమస్య ఉన్నప్పటికీ ఇలా చేయడం తగదు. ఆ స్థానంలో అతడిని దాదాపు ఏడాది పాటు ఆడించారు. అయితే.. తీరా ప్రపంచకప్ ముందు అతడిని తప్పించారు. ఇందుకు గల కారణాలు ఎంటో ఎవరికీ తెలియదు. అని అదే అత్యతం చెత్త సెలక్షన్ కమిటీ.’ అని గంభీర్ అన్నాడు.
కాగా.. 2019 వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఓడడంతో టీమ్ఇండియా ఇంటికి వచ్చేసింది. కివీస్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో ధోనీ రనౌట్ ను అభిమానులు అంత త్వరగా మరిచిపోలేరు. ఆ ప్రపంచకప్ మొత్తం నంబర్ ఫోర్ స్థానంలో సరైన ఆటగాడు లేకపోవడంతో టీమ్ఇండియా ఇబ్బందులు పడింది.
ఇదిలా ఉంటే.. 2023 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. డారిల్ మిచెల్ (130) సెంచరీ, రచిన్ రవీంద్ర (75) అర్ధశతకాలతో రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో షమీ ఐదు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ రెండు, బుమ్రా, సిరాజ్‌లు చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యాన్ని భారత్ 48 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (95) తృటిలో శతకాన్ని రోహిత్ శర్మ(46) అర్ధశతకాన్ని చేజార్చుకున్నారు.