WPL 2026 playoffs qualification scenario RCB into final 4 teams eye on 2 spots
WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ ) 2026 చివరి అంకానికి వచ్చేసింది. గురువారం యూపీ వారియర్జ్ పై విజయం సాధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డబ్ల్యూపీఎల్ 2026 సీజన్‌లో ఫైనల్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది.
ఈ సీజన్‌లో లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లు (ఎనిమిది) ఆడిన ఆర్‌సీబీ ఆరు విజయాలను సాధించి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. ఆర్‌సీబీ మినహా మిగిలిన అన్ని జట్లు తలా 7 మ్యాచ్‌లు ఆడేశాయి. ఇక అన్ని జట్లు లీగ్ దశలో ఇంకొక్క మ్యాచ్ మాత్రమే ఆడనున్నాయి. ఆ మ్యాచ్‌ల్లో గెలిచినప్పటికి కూడా ఏ జట్టు ఆర్‌సీబీ పాయింట్లను దాటడం కాదు కదా సమం చేసే అవకాశం లేదు. ఈ క్రమంలోనే ఆర్‌సీబీ ఫైనల్‌కు చేరుకుంది.
లీగ్ నిబంధనల ప్రకారం టేబుల్ టాపర్ (పాయింట్ల పట్టికలో అగ్రస్థానం) జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది. ఇప్పటికే బెంగళూరు ఫైనల్ చేరుకోవడంతో మిగిలిన రెండు స్థానాల కోసం ఏకంగా నాలుగు జట్లు పోటీపడుతున్నాయి.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు గుజరాత్ ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 8 పాయింట్లతో పట్టికలో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను జనవరి 30న ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే అప్పుడు గుజరాత్ ఖాతాలో 10 పాయింట్లు చేరడంతో పాటు ఎలిమినేటర్ మ్యాచ్‌కు అర్హత సాధిస్తుంది. అలా కాకుండా ఓడిపోతే మాత్రం తిప్పలు తప్పువు. ఎందుకంటే నెట్ రట్‌నేట్ (-0.271) మైనస్‌లో ఉంది.
ముంబై ఇండియన్స్..
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఏడు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో ఆరు పాయింట్లు ఉన్నాయి. ఇక పట్టికలో మూడో స్థానంలో ఉంది. తన చివరి మ్యాచ్‌ను జనవరి 30న గుజరాత్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే అప్పుడు ఆ జట్టు ఖాతాలో 8 పాయింట్లు ఉంటాయి. ఇరు జట్ల పాయింట్లు సమం అయినప్పటికి మెరుగైన నెట్‌రన్‌రేటు కలిగిన ముంబై ఈజీగా ఎలిమినేటర్ మ్యాచ్‌కు వెలుతుంది.
ఢిల్లీ క్యాపిటల్స్..
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు మ్యాచ్‌లు ఆడింది. మూడు మ్యాచ్‌ల్లో గెలిచి 6 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. తన చివరి మ్యాచ్‌ను యూపీతో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ముంబై వర్సెస్ గుజరాత్ మ్యాచ్‌తో సంబంధం లేకుండా ఎలిమినేటర్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిపోతే మాత్రం ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్ లెక్కల పై ఆధాపడి ఉంటుంది.
యూపీ వారియర్జ్..
ఈ సీజన్‌లో యూపీ వారియర్జ్ ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో రెండు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. నాలుగు పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది, ఈ జట్టు ఎలిమినేటర్‌కు అర్హత సాధించాలంటే.. ముందుగా ఢిల్లీ పై భారీ తేడాతో గెలుపొందాలి. అదే సమయంలో ముంబై పై గుజరాత్ భారీ తేడాతో గెలుపొందాలి. అప్పుడు అన్ని జట్ల పాయింట్లు సమమైనా నెట్‌రన్‌రేటు మెరుగ్గా ఉంటే యూపీ ఎలిమినేటర్‌కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో యూపీ ఎలిమినేటర్‌కు చేరుకోవాలంటే ఏదైన అద్భుతం జరగాల్సిందే.