Yashasvi Jaiswal : చ‌రిత్ర సృష్టించేందుకు మ‌రో 57 ప‌రుగుల దూరం

అరంగ్రేట టెస్టులోనే భార‌త యువ ఆట‌గాడు య‌శస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) శ‌త‌కంతో చెల‌రేగాడు. త‌ద్వారా ప‌లు రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు.

Yashasvi Jaiswal

Jaiswal : అరంగ్రేట టెస్టులోనే భార‌త యువ ఆట‌గాడు య‌శస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) శ‌త‌కంతో చెల‌రేగాడు. త‌ద్వారా ప‌లు రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. డొమినికా వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో విండీస్ బౌల‌ర్ల‌ను అల‌వోక‌గా ఎదుర్కొంటూ ప‌రుగులు సాధిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే డెబ్యూ టెస్టులోనే సెంచ‌రీ చేసిన మూడో భార‌త ఓపెన‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. మ‌రో 45 ప‌రుగులు చేస్తే టీమ్ఇండియా త‌రుపున అరంగ్రేట టెస్టులో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిల‌వ‌నున్నాడు.

WI vs IND 1st Test : ఫోర్ కొట్టి సంతోషాన్ని వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ.. ఆ ఫోర్ ప్రత్యేకతేమిటో తెలుసా? వీడియో వైరల్ ..

టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు శిఖ‌ర్ ధావ‌న్ 187 ప‌రుగుల‌తో ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 177 ప‌రుగుల‌తో ఉన్నాడు. ఒక‌వేళ య‌శ‌స్వి జైస్వాల్ మ‌రో 57 ప‌రుగులు సాధిస్తే మాత్రం టీమ్ఇండియా త‌రుపున డెబ్యూ టెస్టులోనే డ‌బుల్ సెంచ‌రీ బాదిన మొద‌టి ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టిస్తాడు.

య‌శ‌స్వి జైశ్వాల్ అందుకున్న ఘ‌న‌త‌లు ఇవే..

– భార‌త జ‌ట్టు త‌రుపున అరంగ్రేట టెస్టులోనే శ‌త‌కం బాదిన 17వ ఆటగాడిగా, మూడో ఓపెనర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. ఓపెన‌ర్ల జాబితాలో ఇంత‌క ముందు శిఖర్‌ ధావన్‌(2016లో), పృథ్వీ షా(2018లో) లు డెబ్యూ మ్యాచుల్లోనే సెంచ‌రీలు చేశారు.

– విదేశాల్లో అరంగేట్రం టెస్టులోనే శ‌త‌కం చేసిన‌ తొలి భారత ఓపెనర్‌గానూ జైశ్వాల్ చ‌రిత్ర సృష్టించాడు.

WI vs IND 1ST Test : అదరగొడుతున్న యశస్వీ జైస్వాల్.. అభినందించిన జై షా.. భారీ ఆధిక్యం దిశగా భారత్..

– విదేశాల్లో డెబ్యూ టెస్టులో శ‌త‌కం చేసిన ఐదో భారత క్రికెటర్‌గా నిలిచాడు. 1959లో ఇంగ్లాండ్ గ‌డ్డ పై అబ్బాస్‌ అలీ, 1976లో సురిందర్‌ అమర్‌నాథ్‌ న్యూజిలాండ్‌పై ఆక్లాండ్‌లో, ప్రవీణ్‌ ఆమ్రే 1992లో డర్బన్‌లో సౌతాఫ్రికాపై, లార్డ్స్‌ వేదికగా 1996లో సౌరవ్‌ గంగూలీ ఇంగ్లాండ్‌పై, 2001లో వీరేంద్ర సెహ్వాగ్ ద‌క్షిణాఫ్రికా పై ఈ ఘ‌న‌త‌ను అందుకున్నారు.

– డెబ్యూ టెస్టులోనే శ‌త‌కం బాదిన నాలుగో యువ‌ క్రికెటర్‌గా జైశ్వాల్‌(21 ఏళ్ల 196 రోజులు) నిలిచాడు.

– వెస్టిండీస్ గ‌డ్డ‌పై టీమ్ఇండియా త‌రుపున అరంగ్రేట టెస్టులోనే శ‌త‌కం బాదిన తొలి భార‌త ఆట‌గాడిగా జైశ్వాల్ రికార్డుల‌కు ఎక్కాడు.

Ravichandran Ashwin : చ‌రిత్ర సృష్టించిన అశ్విన్‌.. అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్‌.. తండ్రీకొడుకును ఔట్ చేసిన మొన‌గాడు

– 91 ఏళ్ల భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో వెస్టిండీస్‌ గడ్డపై టీమిండియా తరపున అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా జైశ్వాల్‌ రికార్డులకెక్కాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచిన వెస్టిండీస్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 150 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం మొద‌టి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భార‌త్ రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 2 వికెట్ల న‌ష్టానికి 312 ప‌రుగులు చేసింది. య‌శ‌స్వి జైశ్వాల్ (143), విరాట్ కోహ్లి (36) లు క్రీజులో ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు