Essential Gadgets
Essential Gadgets : పాకిస్తాన్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ వైమానిక దాడులతో ఉగ్రస్థావరాలపై విరుచుకుపడుతోంది. ఉగ్రవాదులు నక్కిన స్థావరాలను నెలమట్టం చేస్తోంది. ఏప్రిల్ 22న విషాదకరమైన పహల్గాం-బైసారన్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ‘ఆపరేషన్ సిందూర్’తో ప్రతీకారం తీర్చుకుంటోంది.
ఈ నేపథ్యంలో, భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే భారతీయ పౌరులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఏ క్షణం ఏ ముప్పు ముంచుకువస్తుందో తెలియని పరిస్థితి.
సరిహద్దుల్లో సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నప్పటికీ, భారత పౌరులు కూడా ఏదైనా అత్యవసర పరిస్థితికి సిద్ధంగా ఉండాలి. కమ్యూనికేషన్, భద్రత, మనుగడ కోసం ప్రతి భారతీయ ఇంట్లో తప్పనిసరిగా 5 గాడ్జెట్‌లను ఉంచుకోవాలి. అవేంటో ఓసారి వివరంగా తెలుసుకుందాం.
1. బ్యాటరీ రేడియో లేదా ఎమర్జెన్సీ క్రాంక్ రేడియో :
యుద్ధ సమయంలో లేదా విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు మొబైల్ నెట్‌వర్క్‌లు, ఇంటర్నెట్ నిలిచిపోతే.. బ్యాటరీతో నడిచే లేదా హ్యాండ్-క్రాంక్ రేడియో మీ లైఫ్‌లైన్ అవుతుంది.
ఆల్ ఇండియా రేడియో లేదా ఇతర అత్యవసర ప్రసారాల ద్వారా ప్రభుత్వ, సైనిక వనరుల నుంచి నేరుగా అప్‌డేట్స్ అందుకోవచ్చు. అదనపు ప్రయోజనాల కోసం సోలార్ ఛార్జింగ్, ఫ్లాష్‌లైట్, USB సపోర్టు ఉన్న మోడల్‌ను ఎంచుకోండి.
2. సోలార్ పవర్ బ్యాంకులు, ఛార్జర్లు :
దాడులు లేదా ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్తు అంతరాయం సర్వసాధారణం. అధిక సామర్థ్యం గల సోలార్ పవర్ బ్యాంక్ మీరు ఫోన్లు, రేడియోలు లేదా టార్చ్‌లు వంటి ముఖ్యమైన డివైజ్‌లను ఛార్జ్ చేయొచ్చు. మల్టీ USB పోర్ట్‌లు, స్పీడ్ ఛార్జింగ్ వంటివి దగ్గర ఉంచుకోవాలి.
3. పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైయర్ లేదా లైఫ్‌స్ట్రా :
అత్యవసర సమయాల్లో శుభ్రమైన తాగునీటిని పొందడం కష్టంగా మారవచ్చు. లైఫ్‌స్ట్రా లేదా ఏదైనా UV ఆధారిత ప్యూరిఫైయర్ వంటి పోర్టబుల్ వాటర్ ఫిల్టర్ మీ ఇంట్లో ఉంచుకోవాలి.
నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నుంచి మీ కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ఈ వాటర్ ఫిల్టర్ ఉపయోగపడుతుంది.
4.LED ఎమర్జెన్సీ లైట్లు, హెడ్‌ల్యాంప్‌లు :
బాంబు పేలుళ్లు, విద్యుత్తు అంతరాయం లేదా కర్ఫ్యూల సమయంలో ఎక్కువసేపు విద్యుత్ కోతలు ఏర్పడవచ్చు. రీఛార్జబుల్ LED లైట్లు లేదా సౌరశక్తితో పనిచేసే లాంతర్లు మీ ఇంట్లో ఉంచుకోవాలి. హెడ్‌ల్యాంప్‌లతో చీకటిలో వెళ్లేటప్పుడు లేదా ఇతరులకు సాయం చేసే సమయంలో ఎంతో ఉపయోగపడతాయి.
5. డిజిటల్ థర్మామీటర్, ఆక్సిమీటర్‌తో ఎమర్జెన్సీ మెడికల్ కిట్ :
మెడిషన్స్, బ్యాండేజీలు, ప్రిస్క్రిప్షన్ మందులు, డిజిటల్ థర్మామీటర్, పల్స్ ఆక్సిమీటర్ వంటి గాడ్జెట్‌లతో పూర్తిగా ఫస్ట్ ఎయిడ్ కిట్ తప్పనిసరిగా ఇంట్లో ఉంచండి. యుద్ధ సమయాల్లో, ఆసుపత్రులకు వెళ్లకుండా ఇంట్లోనే ప్రాథమిక ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు ఉపయోగపడతాయి.
26 మంది ప్రాణాలను బలిగొన్న విధ్వంసకర పహల్గాం-బైసారన్ ఉగ్రవాద దాడి దేశాన్ని కుదిపేసింది. పాక్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌ను భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్, పీవోజేకేలోని 9 ప్రధాన ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది.
Read Also : BSNL Special Offer : BSNL స్పెషల్ ఆఫర్.. ఈ 3 రీఛార్జ్ ప్లాన్ల ధరలు తగ్గింపు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి..!
సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతున్నందున, భారతీయ కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి కుటుంబం కమ్యూనికేషన్ బ్లాక్‌అవుట్‌లు, కర్ఫ్యూలు, విద్యుత్ సరఫరా కొరత విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.