ATM Transaction Fees
ATM Transaction Fees : మీరు ఏటీఎం నుంచి డబ్బు తీస్తున్నారా? ఇప్పుడు మీరు ఒక నెలలో ఏటీఎం నుంచి ఎన్నిసార్లు డబ్బులు తీస్తున్నారో గుర్తుంచుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏటీఎం లావాదేవీల కోసం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. మే 1, 2025 నుంచి దేశవ్యాప్తంగా ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి. ఈ నిబంధనల కింద ఉచిత లావాదేవీ పరిమితి అదనపు లావాదేవీలపై విధించే ఛార్జీలో మార్పులు చేసింది.
Read Also : Srivari Seva Quota : ఈ నెల 30నే శ్రీవారి సేవ ఆన్‌లైన్ కోటా విడుదల.. కొత్తగా గ్రూపు లీడర్ సేవ..!
ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంతంటే? :
ఇప్పటికీ మెట్రో నగరాల్లో ప్రతి నెలా 3 ఉచిత లావాదేవీలు, మెట్రోయేతర నగరాల్లో 5 ఉచిత లావాదేవీలు అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ లిమిట్ క్యాష్ విత్‌డ్రా వంటి ఆర్థిక లావాదేవీలకు, బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్‌మెంట్, పిన్ మార్పు వంటి ఆర్థికేతర లావాదేవీలకు వర్తిస్తుంది.
ఫ్రీ లిమిట్ తర్వాత ఎంత చెల్లించాలంటే? :
మీరు ఫ్రీ లిమిట్ కన్నా ఎక్కువ లావాదేవీలు చేస్తే.. ఇప్పుడు మీరు ప్రతి అదనపు లావాదేవీపై రూ. 23 (పన్నుతో పాటు) చెల్లించాలి. ఈ నియమం అన్ని ఏటీఎంలకు వర్తిస్తుంది.
బ్యాంకులు ఏం చెబుతున్నాయంటే? :
మే 1 నుంచి ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకుంటే ఫ్రీ లిమిట్ మించి లావాదేవీలకు రూ. 23+ పన్ను చెల్లించాల్సి ఉంటుందని HDFC బ్యాంక్ తెలిపింది. అదే సమయంలో, బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్‌మెంట్, పిన్ మార్పు వంటి లావాదేవీలు ఉచితంగా పొందవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఫ్రీ లిమిట్ తర్వాత ఆర్థిక లావాదేవీలపై రూ.23, ఆర్థికేతర లావాదేవీలపై రూ.11 (GST) ఛార్జ్ చెల్లించాలని PNB తెలిపింది.
ఈ మార్పు మే 9, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. మే 1, 2025 నుంచి ఫ్రీ లిమిట్ తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ సేవింగ్స్, శాలరీ అకౌంట్, NR, కరెంట్ అకౌంట్ ఇండస్ఇండ్ కాని ఏటీఎంలలో నుంచి విత్‌డ్రాపై ప్రతి లావాదేవీకి రూ. 23 చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యంగా ఇతర బ్యాంకు ఏటీఎంలను వినియోగిస్తే.. తమ ఏటీఎం లావాదేవీలపై నిఘా ఉంచాలని కస్టమర్లకు సూచించారు. అధిక ఛార్జీలను నివారించేందకు వీలైనంత వరకు మీ బ్యాంకు ఏటీఎంలను మాత్రమే ఉపయోగించాలి. లేదంటే డిజిటల్ పేమెంట్లు చేయొచ్చు.