WhatsApp Policy
WhatsApp Policy : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా సొంత యాప్ వాట్సాప్‌కు సుప్రీంకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. భారత్ లో ఉంటూ ఆ దేశ చట్టాలను గౌరవించకపోతే ఎలా అంటూ చివాట్లు పెట్టింది. యూజర్ల వ్యక్తిగత ప్రైవసీ ఉల్లంఘన విషయంలో వాట్సాప్ వ్యవహరించే తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
యూజర్ల ప్రైవసీతో ఆటలు ఆడతామంటే ఊరుకునేది లేదని హెచ్చరించింది. మా యూజర్ల డేటాలో ఒక్కటి కూడా మెటాతో షేర్ చేసేందుకు అనుమతించబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ప్రధాన న్యాయమూర్తి సూర్య నేతృత్వంలోని ధర్మాసనం అమెరికన్ కంపెనీ మెటాను హెచ్చరించింది.
వాట్సాప్ 2021 ప్రైవసీకి సంబంధించి పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ముఖ్యంగా కంపెనీ లా ట్రిబ్యునల్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధించిన రూ.213 కోట్ల జరిమానాను సమర్థించింది. ప్రకటనల ప్రయోజనాల కోసం యూజర్ డేటాను షేర్ చేయడంపై సీసీఐ కూడా క్రాస్-అప్పీల్ చేసింది. కంపెనీ ‘అధికార దుర్వినియోగం’ చేయలేదని తీర్పు ఇచ్చిన అనంతరం ట్రిబ్యునల్ అనుమతించింది.
ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాణిజ్య ప్రయోజనాల కోసం యూజర్ డేటాను షేర్ చేసే విధానాన్ని విమర్శించారు ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. “మీరు మా రాజ్యాంగాన్ని పాటించకపోతే భారత్ విడిచి వెళ్లండి.
పౌరుల ప్రైవసీకి భంగం కలిగించేందుకు మేం అనుమతించం” అని అన్నారు. గ్రామీణ పౌరులు, వీధి వ్యాపారులు సహా లక్షలాది మంది వాట్సాప్ యూజర్లు సంక్లిష్టమైన ప్రైవసీ విధానాలను అర్థం చేసుకోలేరని చెప్పారు.
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సొంత అనుభవాన్ని కూడా ప్రస్తావించారు. వైద్యులతో ప్రైవేట్ చాట్ చేసిన తర్వాత యూజర్లకు మెడిషన్స్ ఆధారంంగా యాడ్స్ కూడా వచ్చాయనే విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది.
మెటా, వాట్సాప్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, సీనియర్ న్యాయవాది అఖిల్ సిబల్ కూడా అన్ని మెసేజ్‌లు ‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్’ అయి ఉంటాయని, కంపెనీలు కూడా కంటెంట్‌ను చూడలేవంటూ తమ వాదనలు వినిపించారు.
అసలు కేసు ఏంటంటే? :
నవంబర్ 2024లో 2021 ప్రైవసీ అప్‌డేట్‌పై తీర్పునిస్తూ.. మార్కెట్లో ఆధిపత్యంతో వాట్సాప్ తమ యూజర్లను కొత్త విధానాన్ని పాటించాలని బలవంతం చేస్తోందని ధర్మాసనం తెలిపింది. మెసేజింగ్ సర్వీసులను యాక్సెస్ చేసేందుకు ఇతర మెటా ప్లాట్‌ఫామ్‌లతో డేటా-షేరింగ్‌ను అనుమతించేలా వాట్సాప్ యూజర్లను ప్రేరేపించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యతిరేకించింది.
ఫలితంగా, రూ.213 కోట్ల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని కూడా డిపాజిట్ చేసినట్లు రోహత్గి, సిబల్ కోర్టుకు తెలిపారు. జనవరి 2025లో మెటా, వాట్సాప్ ఆ ఉత్తర్వును సవాలు చేశాయి.