ఫేస్ బుక్‌లో ఫేక్ న్యూస్‌కు చెక్

  • Publish Date - October 26, 2019 / 04:52 AM IST

సోషల్ మీడియాలో ఫేక్ వార్తలకు చెక్ పెట్టేందుకు ఫేస్‌బుక్ కొత్త అప్‌డేట్‌తో ముందుకు వస్తుంది. ‘న్యూస్ ట్యాబ్‌’ పేరుతో వార్తలను అందించేందుకు ఫేస్‌బుక్ సిద్ధం అయ్యింది. ఏది నిజమో.. ఏది అబద్ధమో.. సులభంగా యూజర్లు గ్రహించేలా.. ఉన్నత విలువలతో.. జర్నలిజం స్థాయిని పెంచేలా ‘న్యూస్ ట్యాబ్’ ఉంటుందని ఫేస్‌బుక్ ప్రకటనలో వెల్లడించింది. న్యూయార్క్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో ‘న్యూస్ ట్యాబ్‌’ను ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించారు.

ఈ సందర్భంగా జుకర్ బర్గ్ మాట్లాడుతూ.. న్యూస్ ఏజెన్సీలు అందించే వార్తలను దీనిలో పొందుపరుస్తామని.. జర్నలిజం, ఫేక్ న్యూస్ మధ్య స్పష్టత తెచ్చేందుకు కొత్తగా ఈ రకంగా ముందుకు వస్తున్నట్లు ఫేస్నబుక్ వెల్లడించింది. న్యూస్ కోసం ప్రత్యేకంగా ఒక ఆప్షన్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి అమెరికాలో మాత్రమే దీనిని అందుబాటులోకి తీసుకుని వస్తుండగా.. రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దీనిని అందుబాటులోకి తీసుకుని రానున్నారు.

‘న్యూస్ ట్యాబ్’ కోసం రెండు వందలకు పైగా వార్తా సంస్థలతో ఫేస్ బుక్ ఒప్పందం కుదుర్చుకోనుంది. వాల్ స్ట్రీట్ జర్నల్, వాషింగ్టన్ పోస్ట్, సీబీఎన్ న్యూస్, బజ్ ఫీడ్, ఫాక్స్ న్యూస్, బాస్టన్ గ్లోబ్ వంటి సంస్థలు ఇందులో భాగస్వామ్యం కానున్నాయి.