Digital News Publishers : భారత్‌లో గూగుల్‌, ఫేస్‌బుక్‌ ఆధిపత్యానికి చెక్.. డిజిటల్ న్యూస్ పబ్లిషర్లకు డబ్బులు చెల్లించాల్సిందే..!

ప్రపంచ టెక్ దిగ్గజాలైన గూగుల్, ఫేస్‌బుక్ సంస్థలకు గట్టి షాక్ తగలనుంది. డిజిట‌ల్ న్యూస్ ప‌బ్లిష‌ర్ల‌ కోసం భారత ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకోనుంది.

India Plans To Make Google, Facebook Pay News Publishers For Using Their Content

Digital News Publishers : ప్రపంచ టెక్ దిగ్గజాలైన గూగుల్, ఫేస్‌బుక్ సంస్థలకు గట్టి షాక్ తగలనుంది. డిజిట‌ల్ న్యూస్ ప‌బ్లిష‌ర్ల‌ కోసం భారత ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకోనుంది. ఇకపై న్యూస్ ప‌బ్లిష‌ర్ల‌తో గూగుల్‌, ఫేస్‌బుక్‌ సంస్థలు ఆదాయాన్ని షేర్ చేయాల్సిందే.. ఇందుకోసం దేశంలో ఐటీ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు చేయాలని కేంద్ర ప్ర‌భుత్వం ప్లాన్ చేస్తోంది. భారత్‌లోని డిజిటల్ న్యూస్ ప‌బ్లిష‌ర్ల కంటెంట్‌ను సోష‌ల్ మీడియా దిగ్గ‌జాలు వినియోగించుకుంటున్నాయి. న్యూస్ కంటెంట్ పై వచ్చే ఆదాయంలో వాటాను మాత్రం గూగుల్, ఫేస్‌బుక్ న్యూస్ కంటెంట్ పబ్లిషర్లకు చెల్లించడం లేదు. ఈ మేరకు కొత్త చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర కసరత్తు చేస్తోంది.

ఇందుకు అవసరమైన చట్టపరమైన సవరణలను చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, యూరప్ యూనియన్ వంటి దేశాల్లో డిజిటల్ న్యూస్ పబ్లిషర్లకు గూగుల్, ఫేస్ బుక్ దిగ్గజాలు తమ ఆదాయంలో వాటాను షేర్ చేస్తున్నాయి. అదే తరహాలో భారత్‌లోనూ న్యూస్ పబ్లిషర్లకు ఆదాయంలో వాటాను చెల్లించేలా కొత్త సవరణ చట్టాన్ని తీసుకురానుంది. అదేగానీ జరిగితే.. న్యూస్ ప‌బ్లిష‌ర్ల‌తో గూగుల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, ట్విట్ట‌ర్‌, అమెజాన్ వంటి కంపెనీలు తమ వాటాను షేర్ చేయాల్సి ఉంటుంది. ఇటీవ‌ల కెన‌డా ప్ర‌భుత్వం డిజిట‌ల్ న్యూస్ ప‌బ్లిష‌ర్లు, గూగుల్‌, ఫేస్‌బుక్ వంటి ఆన్‌లైన్ ప్లాట్ ఫాంల మ‌ధ్య రాబ‌డి పంప‌కాల్లో పార‌ద‌ర్శ‌క‌త ఉండేలా చ‌ట్టం తీసుకొచ్చింది. ఇదే దిశగా భార‌త్‌లోనూ ఈ దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

India Plans To Make Google, Facebook Pay News Publishers For Using Their Content 

ప్రస్తుత ఐటీ చట్టాల సవరణల్లో భాగంగా ఈ దిశగా చర్యలు చేపట్టనున్నట్టు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. భారతీయ మీడియా కంపెనీలపై, బిగ్ టెక్ మేజర్‌ కంపెనీలు అమలు చేస్తున్న డిజిటల్ ప్రకటనల విధానం, చట్టబద్ధత, రూపొందించాల్సిన నియమాలను కేంద్రం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. దేశంలో డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్న న్యూస్ పేపర్లు, డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు తమ కంటెంట్ ద్వారా బిగ్ టెక్ కంపెనీలకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నారు. అయితే ఫేస్ బుక్, గూగుల్ కంపెనీలు మాత్రం న్యాయ బద్ధంగా చెల్లించాల్సిన వాటాను మాత్రం న్యూస్ పబ్లిషర్లకు అందించడం లేదని మంత్రి రాజీవ్ పేర్కొన్నారు. సోషల్ మీడియా, టెక్ ప్లాట్‌ఫారమ్‌లతో కొన్ని టెక్ కంపెనీలు మాత్రమే లాభపడ్డాయని తెలిపారు. అసలైన కంటెంట్ పబ్లిషర్లు మాత్రం పెద్దగా లాభపడలేదని తెలిపారు.

ఈ విషయంలో వార్తా సంస్థలకు లబ్ధి చేకూరేలా చట్టబద్ధంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (DNPA), ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (INS) లేవనెత్తాయని, అంతేకాదు.. గూగుల్‌కు వ్యతిరేకంగా ఫెయిర్‌ప్లే వాచ్‌డాగ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)ని ఆశ్రయించినట్టు నివేదికలు వెల్లడించాయి. న్యూస్ పబ్లిషర్లపై అన్యాయంగా షరతులను విధిస్తున్నాయంటూ ఆరోపించాయి. ఈ ఆరోపణలపై CCI గూగుల్‌పై విచారణకు ఆదేశించింది. డిజిటల్ ఫార్మాట్‌లో న్యూస్ పబ్లిషర్లు అందించే వారి కంటెంట్‌కు తగిన మొత్తాన్ని చెల్లించడం లేదని INS కూడా తమ ఫిర్యాదులో లేవనెత్తింది. భారతీయ వార్తాపత్రిక, డిజిటల్ పబ్లిషింగ్ సంబంధిత సంస్థలు ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ , స్పెయిన్‌తో సహా అనేక దేశాల తరహాలోనే తగిన పరిహారం చెల్లించేందుకు అవసరమయ్యే చట్టాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

Read Also : Xiaomi Smart Speaker : IR కంట్రోల్‌తో షావోవీ స్మార్ట్ స్పీకర్.. ధర ఎంతంటే?