భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మే 18న చేపట్టిన PSLV-C61 ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. EOS-09ను మోసుకెళ్లిన ఈ రాకెట్ ప్రయోగంలో మూడవ దశలో సాంకేతిక సమస్య తలెత్తడంతో మిషన్ విఫలమైందని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. అయినప్పటికీ, ఈ వైఫల్యం తమ భవిష్యత్ ప్రణాళికలపై ప్రభావం చూపదని ఇస్రో ఛైర్మన్ తాజాగా వి.నారాయణన్ స్పష్టం చేశారు. ఈ ప్రయోగం ఎందుకు విజయవంతం కాలేదన్న వివరాలను తెలిపారు.
శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన PSLV-C61 రాకెట్ ప్రయోగంలో మొదటి రెండు దశలు విజయవంతంగా పూర్తయ్యాయని ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ తెలిపారు. అయితే, మూడవ దశలో ఊహించని సాంకేతిక సమస్య తలెత్తింది.
“PSLV-C61 మిషన్ మూడో దశలో ఛాంబర్ ప్రెషర్ (ఒత్తిడి) ఊహించిన దానికంటే తక్కువగా నమోదైంది. ఈ పరిణామం నాలుగో దశ పనితీరును దెబ్బతీసింది. ఫలితంగా మేము మిషన్‌ను నష్టపోయాం. దీనిపై జాతీయ స్థాయి నిపుణుల కమిటీ లోతైన విచారణ జరుపుతోంది” అని వి.నారాయణన్ వివరించారు.
PSLV-C61 ద్వారా ప్రయోగించిన EOS-09 ఉపగ్రహం 2022లో విజయవంతంగా ప్రయోగించిన EOS-04కు కొనసాగింపు.
PSLV-C61 ప్రయోగ ప్రధాన లక్ష్యాలు
అత్యంత నమ్మకమైన రిమోట్ సెన్సింగ్ డేటాను అందించడం.
పర్యవేక్షణ ఫ్రీక్వెన్సీని పెంచడం.
ఈ ఉపగ్రహంలో అత్యంత కీలకమైన సింథటిక్ అపెర్చర్ రాడార్ (SAR) పేలోడ్ ఉంది. ఇది పగలు-రాత్రి తేడా లేకుండా స్పష్టమైన చిత్రాలను తీస్తుంది. వర్షం, కారు మబ్బులు వంటి ఎలాంటి వాతావరణంలోనైనా భూమిపై నిఘా పెడుతుంది.
ఈ సామర్థ్యం వల్ల EOS-09 ఉపగ్రహం సక్సెస్ అయితే వ్యవసాయం, అటవీ పర్యవేక్షణ, విపత్తుల నిర్వహణ, పట్టణ ప్రణాళిక, జాతీయ భద్రత వంటి అనేక కీలక రంగాలకు కీలక సమాచారం అందించేది.
రాకెట్ మే 18న ఉదయం 5:59 గంటలకు నిర్దేశిత సమయానికే నింగిలోకి దూసుకెళ్లింది.
మొదటి దశ (PS1), రెండవ దశ (PS2) వేరుపడటం, ఇంజిన్ ప్రజ్వలనం వంటివి దాదాపు ప్రణాళిక ప్రకారమే, స్వల్ప తేడాలతో జరిగాయి.
ప్రయోగం సజావుగా సాగుతోందని భావిస్తున్న వేళ మూడవ దశలో ఒత్తిడి తగ్గడంతో సమస్య మొదలైంది. ఈ కారణంగా EOS-09 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టలేకపోయారు.
ఈ వైఫల్యం ఎదురైనప్పటికీ, భారత స్పేస్ ప్రోగ్రాం వేగంగా ముందుకు సాగుతోందని వి.నారాయణన్ పునరుద్ఘాటించారు. “2025 ఇస్రోకు ఒక మైలురాయిగా నిలవనుంది. చంద్రయాన్-4, జపాన్‌తో కలిసి చేపట్టనున్న చంద్రయాన్-5, గగన్‌యాన్ వంటి ప్రయోగాలు సిద్ధంగా ఉన్నాయి. దేశానికి ఆహారం, నీరు, విద్యుత్ భద్రత కల్పించడమే కాకుండా, 2027 నాటికి మొదటి మానవసహిత అంతరిక్ష యాత్రకు కూడా సన్నద్ధమవుతున్నాం” అని ఆయన అన్నారు. నాసాతో కలిసి అంతర్జాతీయ ప్రయోగాలపై కూడా ఇస్రో దృష్టి సారించింది.
PSLV-C61 మిషన్ వైఫల్యం ఒక చిన్న అడ్డంకి మాత్రమేనని, దీని నుంచి పాఠాలు నేర్చుకుని, మరింత పటిష్ఠంగా భవిష్యత్ ప్రయోగాలకు ఇస్రో సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది.