New RBI Rules: ఆగస్టు 1 నుంచి కొత్త ఆర్బీఐ రూల్స్.. ఇకపై అన్ని వారాల్లో సర్వీసులు!

ఆగస్టు 1 నుంచి ఆర్బీఐ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇకపై NACH సర్వీసులు 24x7 పొందొచ్చు. జీతం, పెన్షన్, ఈఎంఐ పేమెంట్ల వంటి ముఖ్యమైన లావాదేవీల కోసం బ్యాంకుల వర్కింగ్ డే కోసం ఎదురుచూడాల్సిన పనిలేదు.

New RBI Rules: ఆగస్టు 1 నుంచి ఆర్బీఐ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. జీతం, పెన్షన్, ఈఎంఐ పేమెంట్ల వంటి ముఖ్యమైన లావాదేవీల కోసం బ్యాంకుల వర్కింగ్ డే కోసం ఎదురుచూడాల్సిన పనిలేదు. వర్కింగ్ డేతో సంబంధం లేకుండా మీ నెల జీతం లేదా పెన్షన్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (NACH) రూల్స్ మార్చేసింది. ఈ కొత్త రూల్స్ ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి రానున్నాయి. NACH సర్వీసులు ఇప్పుడు వారానికి ఏడు రోజులు అందుబాటులో ఉంటాయి.

ప్రస్తుతం, సోమవారం నుంచి శుక్రవారం వరకు బ్యాంకులు తెరిచినప్పుడు మాత్రమే సౌకర్యాలు అందుబాటులో ఉండేవి. ఇకపై అలా కాదు.. వారమంతా ఈ సర్వీసులను పొందవచ్చు. NACH సౌకర్యాలను ఏ రోజైనా పొందవచ్చు. కొన్నిసార్లు.. నెలలో మొదటి తేదీ వీకెండ్ లలో వస్తుంటుంది. అలాంటప్పుడు జీతం లేదా పెన్షన్, ఈఎంఐ పేమెంట్ల కోసం సోమవారం వరకు వేచి చూడాల్సి వస్తోంది. అప్పుడు మాత్రమే జీతాలు అకౌంట్లో క్రెడిట్ అవుతున్నాయి.

వారాంతంలోనూ సర్వీసులు :
ఇప్పటినుంచి వారాలతో సంబంధం లేదు.. ఎప్పుడైనా మీ అకౌంట్లో నగదు క్రెడిట్ అయిపోతాయి. జూన్ క్రెడిట్ పాలసీ రివ్యూ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. కస్టమర్ల సౌకర్యార్థం 24×7 సర్వీసులను విస్తరిస్తున్నట్టు ప్రకటించారు. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్ (RTGS), NACH సర్వీసులు బ్యాంకుల వర్కింగ్ డేస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇకపై వారంలో అన్ని రోజుల్లో సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

NACH అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహించే బల్క్ పేమెంట్ సిస్టమ్. డివిడెండ్, వడ్డీ, జీతం, పెన్షన్ వంటి వివిధ రకాల క్రెడిట్ బదిలీ చేసుకోవచ్చు. అంతేకాదు.. విద్యుత్ బిల్లు, గ్యాస్, టెలిఫోన్, నీరు, లోన్ ఈఎంఐ, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల సదుపాయం కూడా ఉంది. ఈ సదుపాయాలన్నింటినీ పొందడానికి మీరు సోమవారం నుంచి శుక్రవారం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు మీ లావాదేవీలను వారాంతాల్లో కూడా పొందవచ్చు.

ట్రెండింగ్ వార్తలు