OnePlus 13s రివ్యూ: ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ కిర్రాక్‌ ఉంది భయ్యా.. ఎందుకు కొనొచ్చంటే?

చేతిలో తేలికగా ఇమిడిపోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్ కావాలనుకునే వారికి OnePlus 13s ఒక మంచి ఆప్షన్.

OnePlus ఒక కొత్త ప్రయోగం చేసింది. OnePlus 13sను చిన్న సైజులో తీసుకొచ్చింది. ఇది “అల్టిమేట్ కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్” అని వన్‌ప్లస్‌ కంపెనీ గట్టిగా చెబుతోంది. అంటే, పెద్ద ఫోన్లలో ఉండే టాప్ ఫీచర్లన్నీ ఈ చిన్న సైజు ఫోనులో ఉన్నాయని అర్థం. ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం..

బ్యాటరీ కేక

చిన్న సైజు ఫోనును పెద్ద బ్యాటరీతో తీసుకురావడం కష్టం. కానీ OnePlus 13s ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఇందులో 5,850mAh భారీ బ్యాటరీ అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఒక రోజు కంటే ఎక్కువ సేపు సులభంగా వస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కేవలం గంటా పదిహేను నిమిషాల్లో ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

పనితీరులో రాకెట్ వేగం

ఈ ఫోన్‌లో Snapdragon 8 Elite ప్రాసెసర్ వాడారు. ఇది ప్రస్తుతం మార్కెట్‌లోని అత్యంత వేగవంతమైన చిప్‌లలో ఒకటి. చిన్న ఫోన్ అయినప్పటికీ వేడిని బాగా నియంత్రిస్తుంది. గేమింగ్ లేదా ఎక్కువ సేపు వాడినప్పుడు కాస్త వేడెక్కినా, వెంటనే చల్లబడుతుంది. స్మార్ట్ బైపాస్ టెక్నాలజీతో గేమింగ్ ఆడుతూ కూడా ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు.

చేతిలో ఇమిడిపోయే డిజైన్, కళ్లకు నచ్చే డిస్ప్లే

ఫోన్‌కు 6.32 అంగుళాల LTPO OLED స్క్రీన్ అమర్చారు. దీని అంచులు చాలా సన్నగా ఉండటంతో, మీరు చూస్తున్న కంటెంట్‌లో లీనమైపోతారు. కంటెంట్ చూస్తున్నప్పుడు కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ ఫోన్ డిజైన్, రంగులు చూస్తే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

OnePlus 13sతో సరికొత్త OnePlus AI ఫీచర్లు పరిచయం అయ్యాయి.

కాల్స్, మీటింగ్స్ ఆటోమేటిక్‌గా రికార్డ్ చేస్తుంది.

రికార్డ్ చేసిన ఆడియో, వీడియోలకు సమ్మరీ ఇస్తుంది.

లైవ్ ట్రాన్స్‌లేషన్ చేస్తుంది.

“Plus Key” అనే కొత్త బటన్‌తో మీకు నచ్చిన యాప్స్‌కు షార్ట్‌కట్స్ పెట్టుకోవచ్చు.

కెమెరా

OnePlus 13s కెమెరా విషయంలో కాస్త వెనకడుగు వేసింది. దీని 50MP డ్యూయల్ రియర్ కెమెరా (ప్రధాన కెమెరా + 2x టెలిఫోటో) సాధారణ ఫోటోలు బాగానే తీస్తుంది. కానీ ఫోటోలలో షార్ప్‌నెస్, కలర్స్ కొన్నిసార్లు నిలకడగా ఉండవు. అయితే, 32MP సెల్ఫీ కెమెరా పనితీరు చాలా బాగుంది. మెయిన్, సెల్ఫీ కెమెరాలతో 4K వీడియోలు రికార్డ్ చేయవచ్చు.

ధర ఎంతంటే?

ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.54,999 (12GB RAM + 256GB స్టోరేజ్). హై-ఎండ్ వేరియంట్ ధర రూ.59,999 (12GB RAM + 512GB స్టోరేజ్). iPhone 16, Galaxy S25 వంటి ఫోన్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ ధర.

చేతిలో తేలికగా ఇమిడిపోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్ కావాలనుకునే వారికి OnePlus 13s ఒక మంచి ఆప్షన్. అద్భుతమైన డిజైన్, బలమైన బ్యాటరీ, వేగవంతమైన పనితీరు, కొత్త AI ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ మొత్తానికి చిన్న సైజులో ఉన్న ఒక పవర్ ప్యాక్డ్ జెయింట్ లాంటిది. ఇది “అల్ట్రా సైజ్ లేని అల్ట్రా ఫోన్” అనే ట్యాగ్‌లైన్‌కు సరిగ్గా సరిపోతుంది.