144 Section In Bhadrachalam And Burgampadu Mandals
heavy floods in godavari river : గత కొన్ని రోజులుగా పెరుగుతున్న వర్షాలకు తెలంగాణలోని భద్రాచలంలో గోదావరి నది నీటి మట్టం పెరుగుతోంది. ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో నీటి మట్టం అంతకంతకు పెరుగుతుండటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్ని చేపట్టారు అధికారులు. దీంట్లో భాగంగా భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే భద్రాచలంలోనే గోదావరి వంతెనపై రాకపోకల్ని నిలిపివేశారు.
గోదావరి నది మహోగ్రరూపం దాల్చి.. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం పెరుగుతూపోతోంది. దీంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్ విధించారు. ప్రజలెవరూ ఇళ్లనుంచి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు జారీ చేశారు.
భద్రాచలం బ్రిడ్జిపై గురువారం సాయంత్రం 5 గంటల నుంచి రాకపోకలు నిలిపివేస్తున్నామని ప్రకటించారు. వరద ముంపు దృష్ట్యా వంతెనపై 48 గంటలపాటు రాకపోకలు ఆపేస్తున్నామని వెల్లడించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇది తప్పనిసరి అని ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 61 అడుగులు దాటింది. నదిలో ప్రస్తుతం 18.16 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. దీంతో భద్రాచలం పట్టణాన్ని వరదనీరు చుట్టుముడుతున్నది. పట్టణంలోని కొత్తకాలనీ, సుభాష్‌నగర్ కాలనీ, ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీ, రామాలయం ప్రాంతంలోకి వరద నీరు చేరింది. దీంతో జనజీవితం అస్తవ్యస్తంగా మారింది.