సిరిసిల్లలో 288 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ముందుకొచ్చారు. ప్రభుత్వం ఆదేశిస్తేనే విధుల్లోకి తీసుకుంటామని డిపో మేనేజర్ స్పష్టం చేశారు.
సిరిసిల్లలో 288 మంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ముందుకొచ్చారు. ఎలాంటి షరతుల్లేకుండా తమను విధుల్లోకి తీసుకోవాలని డిపో మేనేజర్ ను కలిసి కార్మికులు విజ్ఞప్తి చేశారు. అయితే విధుల్లోకి తీసుకోవాలని ఎలాంటి ఆదేశాలు రాలేదని.. ప్రభుత్వం ఆదేశిస్తేనే విధుల్లోకి తీసుకుంటామని డిపో మేనేజర్ స్పష్టం చేశారు. దీంతో ఆర్టీసీ కార్మికులు నిరాశతో వెనుదిరిగారు.
సమ్మె విరమణకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు సిరిసిల్ల డిపోలో ఉన్న మొత్తం 288 మంది విధుల్లో చేరాలని వచ్చామని కార్మికులు తెలిపారు. డిపో మేనేజర్ ను కలిసి విధుల్లోకి తీసుకోవాలని కోరామని తెలిపారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని.. ఆదేశాలు వస్తే తీసుకుంటామని డిపో మేనేజర్ చెప్పినట్లు తెలిపారు. సమ్మెకు ముందున్న వాతావరణం కల్పించి, తామందరినీ డ్యూటీలు చేసే విధంగా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయాలని కార్మికులు కోరారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
బుధవారం(నవంబర్ 20,2019) అత్యవసరంగా భేటీ అయిన ఆర్టీసీ జేఏసీ.. సమ్మెపై సంచలన ప్రకటన చేసింది. సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అయితే ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ ఓ కండీషన్ పెట్టింది. ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం కార్మికులను విధుల్లోకి తీసుకుంటేనే సమ్మె విరమిస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. విధుల్లో చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని అన్నారు. సమ్మెకు ముందున్న పరిస్థితులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలను లేబర్ కోర్టుకు ప్రభుత్వం సత్వరమే నివేదించాలన్నారు. ప్రభుత్వం ఆర్టీసీని ఓ ఆదర్శ ఉద్యోగ సంస్థగా చూడాలని హైకోర్టు సూచించిందని గుర్తు చేశారు.
హైకోర్టు తుది తీర్పుపై సమీక్షించుకున్నామని, సమ్మె విరమణకు సిద్ధంగా ఉన్నామని అశ్వత్థామరెడ్డి చెప్పారు. కార్మికులు ఎలాంటి పేపర్లు, షరతులపై సంతకాలు పెట్టరని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. కేవలం డ్యూటీ చార్టుల మీదే కార్మికులు సంతకాలు పెడతారని చెప్పారు. హైకోర్టు తీర్పును గౌరవించే బాధ్యత ఇరుపక్షాలకు ఉందన్నారు. కోర్టు తీర్పు తర్వాత తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె కొనసాగుతుందని అశ్వత్థామరెడ్డి అన్నారు.