×
Ad

Maoists Surrender: లొంగిపోయిన 37మంది మావోయిస్టులు.. డీజీపీ కీలక వ్యాఖ్యలు..

11 నెలల్లో 465 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 59 మంది తెలంగాణకు చెందిన మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు.

Maoists Surrender: 37 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టుల నుంచి 303 రైఫిల్, G3 రైఫిల్, SLR, AK47 రైఫిల్, బుల్లెట్స్, క్యాట్రేజ్ సీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, అప్పాసి నారాయణ అలియాస్ రమేష్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు ముచ్చకి సోమడా అలియాస్ ఎర్రతో సహా మొత్తం 37మంది మావోయిస్టులు లొంగిపోయారు.

మావోయిస్టుల లొంగుబాటుపై డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడారు. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ చేసిన ప్రకటన కారణంగానే మావోయిస్టులు బయటికి వచ్చారని చెప్పారు. ఏ రకంగా బయటికి వచ్చినా మావోయిస్టులను అన్ని విధాలుగా ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. మీడియా ద్వారా వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వచ్చినా, రాజకీయ నాయకుల ద్వారా వచ్చినా మేము స్వాగతిస్తామన్నారు. పార్టీ పరంగా విబేధాలు, ఆరోగ్య సమస్యలు, ఇలా అనేక కారణాలతో మావోయిస్టులు బయటికి వస్తున్నారని డీజీపీ వెల్లడించారు.

”తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆజాద్ 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. ములుగు జిల్లాకు చెందిన ఆజాద్ మీద రూ.20 లక్షల రివార్డ్ ఉంది. అప్పాసి నారాయణ మీద రూ. 20 లక్షల రివార్డ్ ఉంది. మిగతా వారికి 25వేల రూపాయల నగదు ఇస్తున్నాం. 1.41 కోటి రూపాయల రివార్డ్ ను 37మందికి రివార్డ్ గా ఇస్తున్నాం.

11 నెలల్లో 465 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 59 మంది తెలంగాణకు చెందిన మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. ప్రస్తుతం 9మంది కేంద్ర కమిటీలో ఉన్నారు. కేంద్ర కమిటీలో ఐదుగురు తెలంగాణ వారు ఉన్నారు. 10 మంది స్టేట్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. లొంగిపోయిన 37 మందిలో 25 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు” అని డీజీపీ తెలిపారు.

ప్రస్తుతం కేంద్ర కమిటీలో ఉన్న తెలంగాణ వారు..
ముప్పల లక్ష్మణ్ @గణపతి
మలా రాజిరెడ్డి @ సంగ్రాo
తిప్పిరి తిరూపతి @ దేవ్ జీ
గణేష్
దామోదర్