Hanamkonda: తన కష్టసుఖాల్లో ఆరు దశాబ్దాలపాటు తోడునీడగా నిలిచిన భార్య మరణించడంతో తట్టుకోలేకపోయాడు. ఏడాది పాటు ఆమె స్మరణలోనే జీవితాన్ని భారంగా నెట్టుకొచ్చాడు. దీనికితోడు అనారోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో ఇక నువ్వులేని జీవితం నాకొద్దు అంటూ 80ఏళ్ల వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే, నెల రోజుల ముందే తన భార్య సమాధి పక్కనే తన సమాధిని నిర్మించుకోవడం గమనార్హం. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామంలో చోటు చేసుకుంది.
పులుకుర్తి గ్రామానికి చెందిన కాశెట్టి ఆదిరెడ్డికి 80 సంవత్సరాలు. అతని భార్య సమ్మక్క ఏడాది క్రితం అనారోగ్యంతో చనిపోయింది. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్య మరణం తరువాత ఆదిరెడ్డి కృంగిపోయాడు. ఏడాదిపాటు జీవితాన్ని భారంగా నెట్టుకొచ్చారు. పైగా మూత్ర సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల కాలంలో ఎన్ని ఆస్పత్రులు తిరుగుతున్నా నయం కాలేదు.
మేస్త్రీ అయిన ఆదిరెడ్డి.. తన భార్య దూరమవడాన్ని తట్టుకోలేకపోయాడు. నెల రోజుల క్రితం తన పొలంలో భార్య సమాధి పక్కనే తన సమాధిని సైతం సొంతంగా నిర్మించుకున్నాడు. దానిపై ఇద్దరి విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నాడు.
ఆదిరెడ్డి శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని రెండో కుమారుడు రవీందర్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్‌ఐ తెలిపారు.