ట్రాఫిక్ చలానా.. ఆ కుటుంబాన్ని కలిపింది!

Missing Son Through Traffic Challan : కొన్నేళ్ల క్రితం.. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన హైదరాబాదీని తన కుటుంబ సభ్యులతో కలిపింది ట్రాఫిక్ చలానా..  హైదరాబాద్‌ మదీనాగూడకు చెందిన విశ్రాంత ఉద్యోగి ముళ్లపూడి సత్యనారాయణ కుమారుడు సతీష్‌. ఇతడికి పదేళ్ల క్రితం సాఫ్ట్ వేర్ ఉద్యోగినితో పెళ్లి అయింది. 8ఏళ్ల కుమార్తె కూడా ఉంది.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్న సతీశ్ కు వ్యవసాయం అంటే చాలా ఇష్టం.. వ్యవసాయం చేయాలన్న ఉద్దేశంతో తన సాప్ట్ వేర్ ఉద్యోగానికి వదిలేశాడు. అయితే ఈ విషయంలో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దాంతో 2017లో డిసెంబర్ 9న సతీష్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.

కొన్నాళ్లు వెతికినా ఆచూకీ దొరకలేదు. చివరికి అతడి తల్లిదండ్రులు కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కొవిడ్‌-19 సమయంలో ముఖానికి మాస్కు ధరించకుండా పోలీసులు జరిమానా, చలానా విధించారు.

ఆగస్టు 23న జహీరాబాద్‌ పట్టణంలోని భవానీ మందిర్‌ కూడలిలో మాస్కు, హెల్మెట్‌ ధరించకుండా ద్విచక్ర వాహనంపై తిరుగుతున్న సతీష్‌ను ఎస్‌ఐ వెంకటేష్‌ ఆపారు. సతీష్ బైక్ నెంబర్ ను ఫొటో తీసి చలానా విధించారు. చలానా వివరాలను టీఎస్ టికెట్ అప్లికేషన్ లో నమోదు చేశారు. సతీష్ ఆచూకీ కోసం తల్లిదండ్రులు పోలీసులను సంప్రదించారు.

సతీష్ ఇంట్లో నుంచి వెళ్లినప్పుడు ఏమైనా తీసుకెళ్లాడా? అని అడిగారు. బైక్ తీసుకెళ్లాడని చెప్పడంతో అతడి బైక్ వివరాల ఆధారంగా ఏమైనా చలాన్లు ఉన్నాయా? అని పోలీసులు పరిశీలించారు. జహీరాబాద్‌లో ఆగస్టు 23న చలానా విధించిన విషయం వెలుగులోకి వచ్చింది.

జహీరాబాద్‌ పోలీసులు చలానా చెల్లింపుల కోసం సతీష్‌ను రావాలంటూ బుధవారం ఠాణాకు పిలిపించారు. డీఎస్పీ శంకర్‌ రాజు గదిలోకి అతన్ని పంపిన తర్వాత తల్లిదండ్రులను పిలిపించారు. మూడేళ్ల తర్వాత కుమారుడిని చూసిన తల్లిదండ్రులు, అతడి కుమార్తె ఆనందం వ్యక్తం చేశారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.