Child (1)
హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో దారుణం జరిగింది. సింగరేణికాలనీలో దారుణంగా హత్యాచారానికి గురైన చిన్నారి మృతదేహాన్ని ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చిన్నారి హత్యాచార ఘటనపై బస్తీ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడుగా అనుమానిస్తున్న రాజును అప్పగించే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని డిమాండ్ చేశారు.
ఓ దశలో పోలీసులపై రాళ్లు రువ్వి, కారం చల్లడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. ఘటన స్థలాన్ని పోలీస్ జాయింట్ సీపీ చౌహాన్, ఈస్ట్ జోన్ డీసీసీ రమేష్ సందర్శించారు.
చిన్నారిని కిడ్నాప్ చేసిన దుండగుడిని బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు కాలనీ వాసులు. వెంటనే నిందితుడిని పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు.. వాహనాలను అడ్డుకున్నారు.. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.. స్థానికులు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఎట్టకేలకు స్థానికులను పోలీసులు చెదరగొట్టారు.
నిన్న సాయంత్రం 5 గంటల నుంచి బాలిక ఆచూకి కనిపించలేదు. ఎంత వెతికినా ఆచూకి లభించకపోవడంతో కుటుంబసభ్యులకు ఇంటికి సమీపంలోనే ఉండే రాజుపై అనుమానం వచ్చి అతని ఇంటికి వెళ్లారు. కానీ ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో తాళం బద్దలుకొట్టి మరీ పాప కోసం గాలించిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, స్థానికులు ..రాజు ఇంట్లో కనిపించిన దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయారు. పాప విగతజీవిగా కనిపించడంతో అంతా కన్నీళ్లపర్యంతమయ్యారు.
జులాయిగా తిరిగే రాజు…దొంగతనాలు చేస్తుంటాడని స్థానికులు తెలిపారు… ఇప్పటికే దురాలవాట్లకు బానిసైన రాజు భార్యను తరచూ కొట్టేవాడని… దీంతో భార్య విడిచి వెళ్లిపోయిందన్నారు.. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నాడని… కాలనీలో సైకో చేష్టలతో ఇబ్బందులకు గురి చేసేవాడని చెబుతున్నారు. అందుకే పాప కనిపించకపోవడంతో మొదట అతనిపైనే అనుమానంతో వెళ్లి చూస్తే పాప మృతదేహం కనిపించడంతో మృతురాలి కుటుంబసభ్యులు, సింగరేణికాలనీ వాసులు రగిలిపోయారు.
రాజును తమకు అప్పగించాలని, చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజును తమకు అప్పగించకపోతే పాప మృతదేహాన్ని కదలనిచ్చేది లేదంటూ ఆందోళనకు దిగారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.