AE Caught Taking Bribe : నాలాకు ఎన్ వో సీ క్లియరెన్స్ ఇచ్చేందుకు 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఇరిగేషన్ ఏఈని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవికిశోర్ బాధితుల నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
గుమ్మడిదల మండలంలో ఓ వ్యక్తి నాలా క్లియరెన్స్ కోసం ఎన్వోసీ కావాలని అడగ్గా.. అందుకు ఏఈ కిశోర్ 10 లక్షలు డిమాండ్ చేశారు. తాను అంత ఇచ్చుకోలేనని, 7 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో పక్కా స్కెచ్ వేసిన ఏసీబీ అధికారులు బాధితుడి దగ్గరి నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుని కారులోని డ్యాష్ బోర్డులో పెడుతూ ఉండగా అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Also Read : కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంతంలో చెట్ల నరికివేత..! షాక్ కి గురి చేస్తున్న శాటిలైట్ చిత్రాలు..!
ఏసీబీ సిటీ రేంజ్-2 డీఎస్పీ శ్రీధర్ కేసు వివరాలను మీడియాకు తెలిపారు. ”తాను దొరికిపోతాననే భయం ఏఈ రవికిశోర్ లో ఉంది. అందుకే, మాకు దొరక్కుండా తెలివిగా వ్యవహరించాడు. నేరుగా డబ్బులు తీసుకోలేదు. కారు డ్యాష్ బోర్డ్ ఓపెన్ చేసి డబ్బుని అందులో పెట్టాలని బాధితుడితో చెప్పాడు. ఏఈ చెప్పినట్లే బాధితుడు డ్యాష్ బోర్డులో డబ్బులు పెట్టాడు.
డబ్బు పెట్టాక కారుని లాక్ చేసుకుని ఏఈ రవికిశోర్ వస్తుండగా మేము పట్టుకున్నాం. ఆ తర్వాత రవికిశోర్ చేతులు కడిగించాము. డబ్బుని అతడు ముట్టుకోలేదు కాబట్టి కలర్ రాలేదు. అధికారుల ముందు కారు ఓపెన్ చేయించాం. డ్యాష్ బోర్డులో నోట్ల కట్టలు ఉన్నాయి. 50 రూపాయలవి రెండు బండిల్స్, 500 రూపాయలవి రెండు బండిల్స్ ఉన్నాయి. ఏఈని అదుపులోకి తీసుకున్నాం. కారుని కూడా సీజ్ చేశాం”.
Also Read : రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేస్తున్నారా..? మీకో గుడ్ న్యూస్..
ప్రభుత్వ అధికారులు పనులు చేసేందుకు ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీ దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు. లంచం అడగటం నేరం అని స్పష్టం చేశారు. లంచం అడగటం ఎంత నేరమో, లంచం ఇవ్వడం కూడా అంతే నేరం అన్నారు. లంచం ఇచ్చినట్లు నిర్ధారణ అయితే చట్టపరంగా వారు కూడా శిక్షార్హులే అని ఏసీబీ అధికారులు తేల్చి చెప్పారు.