ACB దాడుల్లో పట్టుబడుతున్న వందల కోట్ల అక్రమాస్తులు.. మరి ఆ డబ్బు, బంగారం, భూములు ఏం చేస్తారు?
acb seized assets : ఏసీబీ సోదాల్లో స్వాధీనం చేసుకున్న అవినీతి అధికారుల అక్రమాస్తులు, నగదు, బంగారం, స్థిరాస్తులు చివరకు ప్రభుత్వ ఖజానాకు చేరుతాయా? చట్ట ప్రక్రియ, ఆస్తుల జప్తు, వేలం విధానం ఎలాంటి ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.
- Harish Thanniru
- Updated on- June 11, 2026 / 11:52 AM IST
acb seized assets
- వందల కోట్ల ఆస్తులతో పట్టుబడుతున్న అధికారులు
- సీజ్ చేసి, తాత్కాలికంగా జప్తు చేస్తున్న ఏసీబీ
- లెక్కలు చెప్పకపోతే వేలం వేసే అవకాశం
ACB Seized Assets : రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ACB) ప్రతియేటా వందలాది మంది ప్రభుత్వ అధికారులను లంచాలు తీసుకుంటూ లేదా ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసుల్లో పట్టుకుంటోంది. సోదాల సమయంలో భారీ మొత్తంలో నగదు, బంగారాన్ని, స్థిరాస్తులు, బ్యాంకు డిపాజిట్లు, ఇతర విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంటుంది. అయితే, ఈ ఆస్తులు చివరకు ప్రభుత్వ ఖజానాకు చేరుతాయా? మళ్లీ సంబంధిత వారికి తిరిగి ఇస్తారా.. ఆ ఆస్తులను ఏం చేస్తారు..? ఎక్కడికి తరలిస్తారు అనే విషయాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.
వాస్తవానికి ఏసీబీ సోదాల్లో పట్టుబడిన నగదును నేరుగా ప్రభుత్వ ఖజానాలో డిపాజిట్ చేస్తారు. బంగారం, వాహనాలకు విలువ కట్టించి వేలం వేస్తారు. వీటితో పాటు షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ ఫిక్డ్స్ డిపాజిట్లను కోర్టు ఉత్తర్వుల మేరకు.. బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల ద్వారా మూసివేస్తారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు బదలీ చేయిస్తారు.
ఒకవేళ అక్రమాస్తుల్లో కబ్జాలు చేసినవి గానీ, ప్రభుత్వ భూములు గానీ ఉంటే ప్రత్యేక చట్టం ద్వారా స్వాధీనం చేసుకుని తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. అధికారుల ఆక్రమాస్తులను వేలం వేసిన ఘటనలు రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు లేవని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరూ అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తారు. విధి నిర్వహణలో భాగంగా రూ.100 లంచం తీసుకున్నా చట్టపరమైన చర్యలు తప్పవు. లంచం తీసుకుంటూ పట్టుబడిన వారితో పాటు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసి, వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటుంది. ఈ సందర్భంగా నగదు, బంగారం, ఆస్తి పత్రాలు, బ్యాంకు ఖాతాలు, బినామీ ఆస్తుల వివరాలను కోర్టులో సమర్పిస్తుంది. ఆ తరువాత సంబంధత అధికారికి నోటీసులు జారీ చేసి.. ఆయా ఆస్తులకు సంబంధించిన చట్టబద్దమైన ఆదాయ వనరులను వివరించాలని కోరుతుంది. సరైన ఆధారాలు సమర్పించకపోతే ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసి, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తుంది.
నేరం రుజువైతే ఆస్తుల వేలం..
కోర్టులో విచారణ పూర్తయిన తరువాత నిందితుడు దోషిగా తేలితేనే అక్రమాస్తులపై తుది చర్యలు ప్రారంభమవుతాయి. లంచాల ద్వారా కొనుగోలు చేసిన ఆస్తులను నేరాల ద్వారా కూడబెట్టిన ఆస్తులుగా పరిగణించి ప్రభుత్వానికి అప్పగించాలని కోర్టు ఆదేశించవచ్చు. ఇళ్లు, ప్లాట్లు వంటి స్థిరాస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బహిరంగ వేలం ద్వారా విక్రయించే అవకాశం ఉంటుంది. అలా వచ్చిన మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తారు.
బంగారం, నగదును ఏం చేస్తారు..
ఏసీబీ సోదాల్లో స్వాధీనం చేసుకున్న నగదును ప్రభుత్వ ఖజానాలో డిపాజిట్ చేస్తారు. బంగారం, వాహనాలకు విలువ నిర్దారించి కోర్టు అనుమతితో వేలం వేయవచ్చు. షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, ఫిక్స్ డ్ డిపాజిట్లను కూడా చట్ట ప్రక్రియ పూర్తయిన తరువాత ప్రభుత్వ ఖాతాలకు బదిలీ చేసే అవకాశం ఉంటుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు ఉన్నతాధికారులను ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఏసీబీ అరెస్టులు చేసింది. వీరిలో కొందరు అధికారులు రూ.100 కోట్లకుపైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు విచారణలో బయటపడినట్లు సమాచారం. ఈ కేసుల్లో నిందితులు దోషులుగా తేలి, అక్రమాస్తులు వేలం దశకు చేరితే ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అదే సమయంలో అవినీతి అధికారులకు ఇదో హెచ్చరికగా ఉంటుందని పేర్కొంటున్నారు.
