నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో నున్న శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదంలో గల్లంతైన 9 మంది ఆచూకి కనిపెట్టేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
తెలంగాణ డీజీ విజ్ఞప్తి మేరకు CISF టీమ్ ను దోమలపెంటకు పంపించింది. కమాండెంట్ సిద్ధార్థ రెహ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చేపట్టింది. ఆధునాతన పరికరాలతో ఆపరేషన్ చేపట్టింది. పరిస్థితులను అదనపు డీజీ సీవీ ఆనంద్ పర్యవేక్షిస్తున్నారు.
లోపల చిక్కుకపోయిన వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 35 మందితో పవర్ హౌజ్ లోకి రెస్క్యూ టీమ్ వెళ్లింది. కానీ జలవిద్యుత్ కేంద్రంలో ఆపరేషన్ కు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో లోపలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
పొగను బయటకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరు ఫైరింజన్లతో నీళ్లను చల్లి..పొగను తగ్గించేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు.
2020, ఆగస్టు 20వ తేదీ గురువారం అర్ధరాత్రి మొదటి యూనిట్ లో పెద్ద పెద్ద శబ్దాలతో పేలుడు సంభవించింది. భారీగా మంటలు చెలరేగడం, దట్టంగా పొగలు అలుముకోవడంతో పని చేస్తున్న ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
ప్రాణాలు రక్షించుకోవడానికి బయటకు పరుగులు తీశారు. ప్రమాద సమయంలో 17 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో కొంతమంది మహిళా ఉద్యోగులున్నట్లు సమాచారం. సొరంగమార్గం ద్వారా 8 మంది సురక్షితంగా బయటకు వచ్చారు. కానీ 9 మంది ఉద్యోగుల ఆచూకీ తెలియడం లేదు.
గల్లంతైన వారు : డీఈ శ్రీనివాస్, సుందర్, మోహన్, కుమార్, సుష్మా, ఫాతిమా, వెంకట్ రావు, ఎట్టి రాంబాబు, కిరణ్.